ప్రభుత్వ హెలికాప్టర్లో పెళ్లి ఫొటోలు దిగినందుకు గాను వైమానిక సిబ్బందిపై సస్పెషన్ వేటు పడింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది.
భాజపా నేత సంకేత్ సాయికి కొన్ని రోజుల క్రితం పెళ్లయింది. అందరికంటే భిన్నంగా పెళ్లి ఫోటోలు దిగాలనుకున్నారు. అందుకు హెలికాప్టర్ సరైనదని భావించారు. అందుకు రాష్ట్ర వైమానిక సర్వీస్‌లో పని చేస్తున్న యోగేశ్వర్ సాయి అనే వ్యక్తిని సాయం అడిగారు. అందుకు యోగేశ్వర్ అంగీకరించాడు.
సంకేత్ తన భార్యతో కలసి ప్రభుత్వ హెలికాప్టర్లు ఆగి ఉండే ప్రదేశానికి జనవరి 20న వెళ్లారు. అక్కడి భద్రతా సిబ్బంది జంటను అడ్డుకున్నారు. అయితే తనకు అనుమతి ఉందని సంకేత్ చెప్పారు, అంతేకాకుండా అతని వెంట యోగేశ్వర్ కూడా ఉండడం వల్ల భద్రతా సిబ్బంది అడ్డుచెప్పలేదని పోలీసులు తెలిపారు. తదనంతరం దంపతులిద్దరూ హెలికాప్టర్లో ఫొటోలు దిగారు. సంబంధింత ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీనిపై పెద్ద దుమారం రేగింది. దాంతో సదరు వైమానిక సిబ్బంది యోగేశ్వర్ సాయిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఈ వ్యవహారంపై సీఎం భూపేశ్ భఘేల్ స్పందించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. నవ దంపతులకు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
అయితే కాంగ్రెస్ నేత వికాస్ తివారీ మాత్రం ఈ ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భాజపా నేత ధరమ్లాలా కూడా ఈ ఘటనను ఖండించారు.
ఇదీ చూడండి: తమిళిసై నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ