Nepal gang arrest: తాళం వేసి ఉన్న ఇళ్లను కనిపెట్టి కొల్లగొట్టడం ఈ ముఠా పని. ఇంటికి తాళాలు వేసి ఉన్నాయో లేవో పగలంతా తిరిగి జల్లెడపడతారు. తాళం వేసి ఉంటే చాలు.. రాత్రిపూట వచ్చి దొరికినకాడికి నగదు, బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిపోతారు. ఈ దొంగలో ముఠా వ్యక్తులు అందరూ నేపాల్ దేశస్థులే.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జ్ఞానప్పిరకాసంకు చెన్నై అన్నానగర్‌లోని పూనమల్లి సన్నతి వీధిలో ఓ ఇల్లు ఉంది. ప్రస్తుతం ఈయన వేరే ఇంట్లో కుటుంబంతో కలసి ఉండడం వల్ల అన్నానగర్‌లోని ఇల్లు అయిదు నెలలుగా ఖాళీగా ఉంది. అప్పుడప్పుడు నివాసానికి వచ్చేవారు ఈ మాజీ న్యాయమూర్తి. అలా మార్చి 29వ తేదీన మాజీ జడ్జి వచ్చే సరికి ఆయన ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దీంతో షాకైన ఆయన ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగలగొట్టి ఉంది. అందులో నుంచి రూ.5 లక్షలు నగదు, రూ.5 లక్షల విలువైన నగలు దోచుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే బాధితుడు అన్నానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ టీం ఈ దొంగతనంపై దర్యాప్తు ప్రారంభించింది. బాధితుని ఇంటి దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలను పరిశీలించింది. అందులో ఓ సైక్లిస్ట్ వరుసగా మూడు రోజులుగా వరుసగా ఇంటికి వచ్చినట్లు కనిపించింది.
పోలీసులు ఆ ప్రాంతంలోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. షెనాయ్‌నగర్‌లోని ఓ ఇంట్లో దొంగ వాడిన సైకిల్ పార్క్ చేసి ఉన్నట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో ఉన్న నేపాలీ దేశస్థుడు భువనేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇంకా మిగిలిన దొంగలు లాల్, గణేశన్, బద్రాయ్ కోసం వెతకడం ప్రారంభించారు. నిందితుల సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వీరు బెంగళూరు, హైదరాబాద్‌లో ఉన్నట్లుగా గుర్తించారు. అనంతరం నిందితులు.. గణేశన్, బద్రోయ్‌ను బెంగళూరులో అరెస్ట్ చేశారు. లాల్‌ను చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. షెనాయ్ నగర్ ప్రాంతంలోని ఓ ఇంటిలో లాల్.. వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.
తాళం వేసి ఉన్న ఇళ్లను గమనిస్తాడు లాల్. తరువాత ముఠాతో కలిసి దొంగతనాలకు పాల్పడడం అలవాటు. అలాంటి సమయంలోనే హైకోర్టు రిటైర్డ్ జడ్జి జ్ఞానప్పరికాసం ఇంటికి గత ఐదు నెలలుగా తాళం వేసి ఉన్నట్టు ఈ దొంగల ముఠా గమనించింది. అనంతరం ఆ ముఠా.. మార్చి 22న రిటైర్డ్ జడ్జి ఇంటికి వెళ్లి మద్యం సేవించారు. రెండో రోజు ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి దోచుకెళ్లారు. ఎవరూ ఫిర్యాదు చేయకపోయే సరికి వీరికి మరింత ధైర్యం వచ్చింది. మూడో రోజు మళ్లీ వచ్చి మిగతా వస్తువులను ఎత్తుకెళ్లారు. జరిగిన మార్చి 29వ తేదీన జస్టిస్ జ్ఞానప్పిరకాసం తన ఇంటికి రాగా ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడం గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అరెస్టయిన దొంగల నుంచి పోలీసులు నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. చోరీతో సంబంధమున్న మరికొంత మంది అనుమానితుల కోసం వెతుకుతున్నారు. నేపాల్ దేశస్థుల అరెస్టు గురించి ఆ దేశ రాయబార కార్యాలయానికి సమాచారం అందించారు చెన్నై పోలీసులు.
ఇదీ చదవండి: అభాగ్యుడి 'ఆకలి చావు'.. చెత్త కుప్పలోని శవాన్ని కుక్కలు తినేసి...