నీట్ ప్రవేశాల్లో పేదల (ఈడబ్ల్యూఎస్) కోటా (NEET Latest News) కింద అర్హులను నిర్ణయించేందుకు 'రూ.8 లక్షల వార్షిక ఆదాయ పరిమితి' విధించడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్ధించుకుంది. ఈ మేరకు సామాజిక న్యాయశాఖ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. రాజ్యాంగంలోని 14, 15, 18 అధికరణాలను అనుసరించి, ఈ మొత్తాన్ని (EWS Quota in NEET) హేతుబద్ధంగా నిర్ణయించినట్టు అందులో విస్పష్టం చేసింది.
ఓబీసీ రీజర్వేషన్ల (NEET OBC Reservation News) విషయంలో 'క్రిమీలేయర్ నిర్ణయానికి అనుసరించిన విధానమే ఈడబ్ల్యూఎస్కూ వర్తిస్తుందని పేర్కొంది. సంబంధిత వ్యక్తులు, సంస్థలతో విస్తృతంగా చర్చించిన మీదటే రూ.8 లక్షల వార్షిక ఆదాయ పరిమితిని కొలమానంగా నిర్ణయించినట్టు వివరించింది.
"ఆదాయ పన్ను విధించదగ్గ పరిమితి కంటే తక్కువ రాబడి ఉన్న జనరల్ కేటగిరి విభాగంలోని బీపీఎల్ కుటుంబాలన్నింటినీ ఈడబ్ల్యూఎస్ కింద గుర్తించవచ్చని మేజర్ జనరల్ సిన్హో కమిషన్ పేర్కొంది. 2016లో ఓబీసీ కేటగిరి క్రీమీలేయర్ నిర్ధారణకు గరిష్ట వార్షికాదాయ పరిమితిని రూ.6 లక్షలుగా నిర్ణయించారు. వినియోగదారుల ధరల సూచీని అనుసరించి ఈ పరిమితి ఎప్పటికప్పుడు మారుతూ వస్తోంది. ప్రస్తుతం దీన్ని రూ.8 లక్షలుగా నిర్ధారించడం సమంజస" అని అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) ర్యాంకుల ఆధారంగా.. వివిధ వైద్య కోర్సుల్లో అఖిల భారత కోటా సీట్లను (NEET Reservation News) మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ భర్తీ చేస్తోంది. అయితే, ఈ ప్రవేశాలు కల్పించే విషయంలో ఓబీసీ విభాగానికి 21%, ఈడబ్ల్యూఎస్‌కు మరో 10% రిజర్వేషన్ కల్పించనున్నట్టు పేర్కొంది. దీన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపడుతోంది.
ఇదీ చూడండి: నీట్ పీజీ కౌన్సిలింగ్‌కు బ్రేక్.. సుప్రీం నిర్ణయం తర్వాతే!