క్రైస్తవం, ముస్లిం మతాల్లోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విషయంలో అభిప్రాయం చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు చర్య తీసుకుంది. కమిషన్‌లో సభ్యులుగా 1981వ బ్యాచ్ హిమాచల్‌ప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రవీందర్ కుమార్ జైన్, యూజీసీ సభ్యురాలు ప్రొఫెసర్ సుష్మా యాదవ్‌ను నియమిస్తూ గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ కమిషన్ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్లలో నివేదిక సమర్పించాలని గడువు విధించింది. కమిషన్ దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నట్లు పేర్కొంది.
"ఇతర మతాల్లోకి మారినవారినీ ఎస్సీలుగా గుర్తించాలంటూ ఇటీవలి కాలంలో చాలా డిమాండ్లు వచ్చాయి. ఈ వాదనలను కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ సంక్లిష్టమైన అంశంపై సామాజిక, రాజ్యాంగపరమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికున్న ప్రాధాన్యం, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్సీ హోదా కట్టబెట్టే అంశంలో మార్పులు చేర్పులు చేయాలంటే కమిషన్స్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ 1952 కింద కచ్చితమైన అధ్యయనం చేయడంతోపాటు, విస్తృత సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఆ చట్టంలోని సెక్షన్ 3కింద ఉన్న అధికారాలను ఉపయోగించి ఇప్పుడు 'కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ'ని ఏర్పాటు చేస్తున్నాం" అని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.
కమిషన్‌కు అప్పగించిన విధివిధానాలు
- చారిత్రకంగా తాము ఎస్సీలమని చెప్పుకుంటూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 కింద రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పొందుపరిచిన మతాల్లోకి కాకుండా ఇతరమతాల్లోకి మారిన వారికి ఎస్సీ హోదా కట్టబెట్టడం గురించి అధ్యయనం చేయడం.
- అలాంటి వారిని ఇప్పుడున్న ఎస్సీల జాబితాలో చేరిస్తే ఎస్సీలపై చూపే ప్రభావం గురించి పరిశీలించడం.
- ఎస్సీలు ఇతర మతాల్లోకి మారడంవల్ల సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక పరిస్థితులు, హోదాపరమైన వివక్ష, పేదరికాల్లో వస్తున్న మార్పులు ఏంటి? అలాంటి వారికి ఎస్సీ హోదా కల్పించడంవల్ల తలెత్తే ప్రభావాలేంటి? అన్న అంశంపై అధ్యయనం చేయడం.
- ఇంకా ఏవైనా అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉన్నట్లు కమిషన్ భావిస్తే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి, దాని అనుమతితో ఆ అంశాలపైనా అధ్యయనం చేపట్టడ్డాన్ని కమిషన్ ప్రధాన బాధ్యతగా అప్పగించారు.
కేసు విచారణకు రాబోతున్న నేపథ్యంలో కమిషన్ ఏర్పాటు
దళిత క్రిస్టియన్లు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కట్టబెట్టే అంశం వచ్చే మంగళవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఆ అంశంపై అధ్యయనం కోసం కమిషన్ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఉన్న రాజ్యాంగ ఉత్తర్వుల ప్రకారం హిందు, బౌద్ధ, సిక్కు మతాల్లోని వారిని మాత్రమే ఎస్సీలుగా గుర్తిస్తున్నారు. అయితే సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఇతర మతాల్లోకి మారినవారికీ ఎస్సీ హోదా కట్టబెట్టేలా ఉత్తర్వులు జారీచేయాలని కోరుతూ 2004లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. గత ఆగస్టు 30వ తేదీన జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఏఎస్ ఓక్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌లతో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు దీనిపై కేంద్రం మూడు వారాల్లోపు తన అభిప్రాయాన్ని చెప్పాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 11కు వాయిదా వేసింది. ఆ తేదీ దగ్గరపడటంతో దీనిపై అధ్యయనం కోసం కమిషన్ ఏర్పాటు చేసినట్లు కేంద్రం కోర్టుకు తెలుపడానికి వీలుగా జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది.