ప్రభుత్వ కార్యాలయాల్లో అన్నిస్థాయిల ఉద్యోగులకు బయోమెట్రిక్ అటెండెన్స్‌ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ. నవంబర్ 8 నుంచి ఆదేశాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
కరోనా కారణంగా బయోమెట్రిక్ హాజరు విధానాన్ని నిలిపివేశారు. తాజాగా జారీ చేసిన ఆదేశాల ప్రకారం.. బయోమెట్రిక్ యంత్రాల పక్కన శానిటైజర్లను కచ్చితంగా ఏర్పాటు చేయాలి. ప్రతి ఉద్యోగి.. అటెండెన్స్ వేయకముందు, వేసిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవాలి. ఈ బాధ్యత సంబంధిత విభాగాధిపతిదే. ఉద్యోగులు కూడా 6 అడుగుల దూరాన్ని పాటిస్తూ క్యూలో నిలబడాలి. అవసరమైతే అదనంగా బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయాలి.
"ఉద్యోగులు ఎల్లప్పుడూ మాస్కులు ధరించాల్సిందే. అటెండెన్స్ వేస్తున్న సమయంలోనూ మాస్కులు ధరించాలి. సమావేశాలు మాత్రం ఆన్లైన్లోనే నిర్వహించాలి. మరీ అవసరమైతే తప్ప భౌతిక సమావేశాలను ఏర్పాటు చేయకూడదు."
-- సిబ్బంది వ్యవహారాల శాఖ
ఆఫీసుల్లో ఉన్నంత సేపు అధికారులు, సిబ్బంది కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది సిబ్బంది వ్యవహారాల శాఖ.
ఇదీ చూడండి:- ఆ కార్యాలయాల్లో రాజ్‌నాథ్ ఆకస్మిక తనిఖీ- ఉద్యోగులు షాక్!