హెరిటేజ్ కన్జర్వేటివ్ కమిటీ(హెచ్‌సీసీ) అనుమతులు రాగానే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంటు భవన నిర్మాణ పనులను ప్రారంభిస్తామని కేంద్ర ప్రజా పనుల శాఖ(సీపీడబ్ల్యూడీ) అధికారులు తెలిపారు.
హెచ్‌సీసీ అధికారిక వెబ్సైట్ ప్రకారం కేంద్ర గృహ, పట్టణ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి లేదా అదనపు కార్యదర్శి కమిటీకి ఛైర్మన్‌గా ఉంటారు.
దేశ రాజధానిలో వారసత్వ భవనాలు, వారసత్వ ఆవరణలు, సహజ సదుపాయ ప్రాంతాల రక్షణ కోసం దిల్లీ బిల్డింగ్ బైలాస్ 1983లో కొత్త నిబంధన 23 ను చేర్చి హెచ్‌సీసీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో సభ్యులుగా అదనపు డైరెక్టర్ జనరల్(సపీడబ్ల్యూడీ), చీఫ్ టౌన్ ప్లానర్(ఎంసీడీ), డీడీఏ కమిషనర్, చీఫ్ ఆర్కిటెక్ట్(ఎన్డీఎంసీ), డీజీ ప్రతినిధులు, నేషనల్ మ్యూజియం ఆఫ్ నేషనల్ హిస్టరీ డైరెక్టర్ ఉంటారు.
హెచ్‌సీసీని త్వరలోనే సంప్రదించి అనుమతుల కోసం విజ్ఞప్తి చేస్తామని కేంద్ర గృహ, పట్టణ అభివృద్ధి శాఖ అధికారి ఒకరు తెలిపారు. అధికారిక ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త పార్లమెంటు భవన నిర్మాణాన్ని మొదలు పెడతామని చెప్పారు.
కొత్త భవనం నమూనా ప్రస్తుత భవనాన్ని పోలి ఉన్నందున హెచ్‌సీసీ అనుమతుల విషయంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం లేదని మరో అధికారి తెలిపారు.
నూతన పార్లమెంటు భవన నిర్మాణ కాంట్రాక్టును టాటా ప్రాజెక్స్ట్ లిమిటెడ్ గతేడాది సెప్టెంబర్‌లో దక్కించుకుంది.
సుప్రీం గ్రీన్ సిగ్నల్..
పార్లమెంట్ నూతన భవనంతో పాటు, కేంద్ర ప్రభుత్వ సచివాలయం నిర్మించడానికి ఉద్దేశించిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టు డిజైన్‌పై కేంద్రం వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. డీడీఏ చట్టం కింద చేపట్టిన ఈ ప్రాజెక్టు చట్టబద్ధమైనదేనని, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన అనుమతులు, స్థలం కేటాయింపులు కూడా సరిగ్గానే ఉన్నాయని న్యాయస్థానం తెలిపింది. అయితే ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించే స్మాగ్ టవర్లు(చిమ్నీల్లాంటివి) ఏర్పాటు చేయాలని, యాంటీ-స్మాగ్ గన్నులను ఉపయోగించాలని ఆదేశించింది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణాలకు హరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ అనుమతి అవసరమని, వెంటనే ఆ అనుమతులు తెచ్చుకోవాలని సూచించింది.
ప్రజాస్వామ్య దేవాలయంగా పరిగణించే పార్లమెంట్ నూతన భవనంలో అణువణువనా భారతీయత ప్రతిబింబించనుంది. లోక్‌సభ పైకప్పు పురివిప్పి ఆడుతున్న నెమలి ఆకృతిలో, రాజ్యసభ పైకప్పు విరబూసిన కమలం రూపంలో ఉండనున్నాయి. జాతీయ వృక్షమైన మర్రిచెట్టు పార్లమెంట్‌లో అంతర్భాగంగా నిలువనుంది.