al qaeda threat letter: మత ప్రభోదకుడిపై భాజపా నేతలు చేసిన వ్యాఖ్యలు ఇంటా, బయట రచ్చ లేపుతున్నాయి. ఇప్పటికే పలు ఇస్లామిక్ దేశాలు భారత్‌పై పలు ఆంక్షలు విధించాయి. ఈ వ్యాఖ్యలకు నిరసనగా భారత్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిస్తూ ఆల్‌ఖైదా ఉగ్రసంస్థ లేఖ విడుదల చేయడం కలకలం రేపింది. దిల్లీ, ముంబయి, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని హెచ్చరించింది. ఈ హెచ్చరికలను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర దర్యాప్తు, నిఘా సంస్థలు ఆయా ప్రాంతాల్లో నిఘాను పటిష్ఠం చేశాయి. విమానాశ్రయాలు, మెట్రో, రైల్వే స్టేషన్లు, మార్కెట్లలో గస్తీని పెంచాయి. అనుమానాస్పదంగా ఎలాంటి చర్యలు గుర్తించినా.. సంబంధిత అధికారులకు వెంటనే నివేదించాలని సిబ్బందికి సూచించాయి.
అంతకుముందే.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని అంతర్జాతీయ ఉగ్రసంస్థ అల్‌ఖైదా ప్రకటించింది. భారత్‌లోని దిల్లీ, ముంబయి నగరాలతో పాటు, ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలలో ఆత్మాహుతి దాడులకు పాల్పడతామని హెచ్చరించింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను సైతం హతమారుస్తామని 6వ తేదీతో వెలువడిన లేఖలో ఉగ్రసంస్థ పేర్కొంది. శరీరాలకు పేలుడు పదార్థాలను బిగించిన ఆత్మాహుతి దళాలను రంగంలోకి దించుతామంది. తమ పిల్లలను సైతం ఇందుకు వినియోగిస్తామని పేర్కొంది.
భాజపా మాజీ అధికార ప్రతినిధులు నుపుర్ శర్మ, నవీన్‌కుమార్ జిందాల్ వ్యాఖ్యలపై ఇస్లామిక్ దేశాలు తీవ్ర నిరసనలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అల్‌ఖైదా ఈ హెచ్చరిక చేసింది. అయితే కొందరు వ్యక్తుల వ్యాఖ్యలను ప్రభుత్వానికి ఆపాదించడం, తగదని భారత దౌత్యాధికారులు ఇప్పటికే ఆయా దేశాలకు స్పష్టం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై భారతీయ జనతా పార్టీ చర్చలు తీసుకుంటుందని వివరించారు.
ఇదీ చదవండి: పార్కింగ్ ప్రదేశంలో భారీ అగ్ని ప్రమాదం.. 90 వాహనాలు దగ్ధం