ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల నియంత్రణపై సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. నూతన నిబంధనల ప్రకారం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి సంస్థల కంటెంట్‌ను పర్యవేక్షిస్తున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది.
చట్ట సభ్యులు, మేధావుల నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ గురించి తమకు చాలా ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది. వాటిని పరిశీలించిన తర్వాత, ఈ ఏడాది ఓటీటీ ప్లాట్‌ఫామ్ కంటెంట్‌ను పర్యవేక్షించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్-2021ను(ఇంటర్మీడియరీ గైడ్‌లైన్స్, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) ప్రవేశపెట్టామని కేంద్రం వెల్లడించింది. ఈ చట్టంలోని 67,67ఎ, 67 బి సెక్షన్ల కింద అభ్యంతరకరమైన కంటెంట్‌ను ప్రభుత్వం నిషేధిస్తుందని అఫిడవిట్లో పేర్కొంది.
ఓటీటీ ప్లాట్ఫామ్లో కంటెంట్ అంశంపై శశాంక్ శేఖర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల నియంత్రణపై తీసుకున్న చర్యల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలో కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇదీ చూడండి: ఆ క్రమబద్ధీకరణ నిబంధనలు చట్టబద్ధమేనా?