CDS Chopper Crash Reason: భారత త్రిదళాధిపతి బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి యాంత్రిక వైఫల్యం, కుట్ర, నిర్లక్ష్యం కాదని స్పష్టమైంది. 2021 డిసెంబర్ 8న జరిగిన ప్రమాదంపై దర్యాప్తు కోసం త్రివిధ దళాల ఉన్నతాధికారులతో వాయుసేన ఏర్పాటు చేసిన కమిటీ ఈమేరకు ప్రాథమిక నివేదిక అందజేసింది. ఫ్లైట్ డేటా రికార్డర్‌ను విశ్లేషించి ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
Tamil Nadu Helicopter crash enquiry
వాతావరణంలో అనూహ్య మార్పుల వల్ల చాపర్ అకస్మాత్తుగా మేఘాల్లోకి ప్రవేశించిందని ఆ కమిటీ తన నివేదికలో వివరించింది. ఫలితంగా కొండ ప్రాంతంలో పరిస్థితిని అంచనా వేయడంలో పైలట్ ఇబ్బంది పడ్డారని పేర్కొంది. తద్వారా అప్పటివరకు నియంత్రణలో ఉన్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైందని తెలిపింది.
ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూసేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఆ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. వాటిని సమీక్షించి, తగిన నిర్ణయం తీసుకుంటామని వాయుసేన స్పష్టం చేసింది.
ఘోర ప్రమాదం..
తమిళనాడులోని కూనూర్ సమీపంలో 2021 డిసెంబర్ 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రిదళాధిపతి(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ సహా 14 మంది దుర్మరణం చెందారు. వెల్లింగ్టన్ సైనిక కళాశాలలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ఇదీ చదవండి: శబరిమల 'మకరజ్యోతి' దర్శనం- భక్తజనం పరవశం