High Court judge corruption case: అలహాబాద్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ శుక్లాను విచారించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు కేంద్ర ప్రభుత్వం అనుమతించినట్లు అధికారులు తెలిపారు. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి సంబంధించిన కేసులో జస్టిస్ శుక్లా కాలేజీ యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఈ విషయంపై ఆయన్ను విచారించేందుకు సీబీఐ ఏప్రిల్ 16న కేంద్రం అనుమతి కోరుతూ లేఖ రాసింది. కేంద్రం ఇప్పుడు సానుకూలంగా స్పందించగా.. విశ్రాంత న్యాయమూర్తిపై (cbi case on high court judge) ఛార్జిషీట్ దాఖలు చేసేందుకు సీబీఐ సిద్ధమైంది.
ఈ కేసులో జస్టిస్ శుక్లా (S N Shukla in corruption case)తో పాటు ఛత్తీస్‌గఢ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఐఎం ఖుద్దూసీ ప్రసాద్ (high court judge in corruption case ), ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కు చెందిన భగవాన్ ప్రసాద్ యాదవ్, పలాశ్ యాదవ్, ట్రస్ట్, భావనా పాండే, సుధీర్గిరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. నిందితులపై అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ను నమోదైనట్లు చెప్పారు. జస్టిస్ శుక్లా నుంచి అనుకూలమైన తీర్పు పొందేందుకుగానూ.. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఓ వ్యక్తి ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సీబీఐ లఖ్‌నవూ, మేరఠ్, దిల్లీ సహా మిగతా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
సౌకర్యాల లేమి కారణంగా ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో విద్యార్థులు చేరకుండా కేంద్రం 2017 మేలో డిబార్ చేసిందని అధికారులు తెలిపారు. ఈ నిర్ణయాన్ని ట్రస్ట్ రిట్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టులో సవాలు చేసిందని పేర్కొన్నారు. తరువాత దానిని ఉపసంహరించుకున్న ట్రస్ట్... తిరిగి లఖ్‌నవూ బెంచ్‌లో రిట్ పిటిషన్ వేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ శుక్లా ట్రస్ట్‌కు అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేశారని ఎఫ్‌ఐఆర్‌లో అధికారులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: న్యాయవ్యవస్థ రక్షణకు సహకరించండి: జస్టిస్ రమణ