Cash For Posting Karnataka CM Son : నగదు తీసుకొని అధికారులను బదిలీ చేస్తున్నారంటూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుమారుడు యతీంద్రపై ఆరోపణలు భగ్గుమన్నాయి. ముఖ్యమంత్రి కుమారుడు 'సూపర్ సీఎం'గా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలు మండిపడ్డాయి. ఓ కార్యక్రమంలో పాల్గొన్న యతీంద్ర.. ఫోన్‌లో సంభాషించిన వీడియో వైరల్ కావడం వల్ల తాజా వివాదం మొదలైంది. అయితే, ఈ వ్యవహారంపై సీఎం సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. యతీంద్ర ఫోన్‌కాల్ సంభాషణ.. కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్ఆర్) కింద వెచ్చించే నిధులకు సంబంధించినవని వివరణ ఇచ్చారు. విపక్షాలు తమ ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని సిద్ధరామయ్య సవాల్ విసిరారు.
వివాదం ఇదీ..
ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో యతీంద్ర ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియో వైరల్ అయ్యింది. ఓ జాబితాలోని కొన్ని పేర్లను ప్రస్తావిస్తూ.. మార్పులు చేయాలని అటువైపు వారిని యతీంద్ర సూచిస్తున్నట్లు అందులో ఉంది. అది అధికారుల బదిలీలకు సంబంధించినదే అంటూ జేడీఎస్ అగ్రనేత, మాజీ సీఎం కుమారస్వామి ఆరోపణలు గుప్పించారు. ఆ జాబితాలో ఉన్నది ఎవరని ప్రశ్నించారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ సైతం విమర్శలు గుప్పించింది. యతీంద్ర.. సీఎం కంటే కీలక శక్తిగా మారిపోయారని ఆరోపించింది. సిద్ధరామయ్య స్థానం నామమాత్రంగానే ఉందని, పాలన మొత్తం కుమారుడి చేతుల్లో సాగుతోందని విమర్శించింది.
ఆధారాలు చూపిస్తే వైదొలుగుతా: సీఎం
అయితే, ఈ ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య దీటుగా తిప్పికొట్టారు. యతీంద్ర మాట్లాడింది తనతోనేనని స్పష్టం చేశారు. సీఎస్ఆర్ నిధులతో పాఠశాల భవనాల నిర్మాణం గురించి ఆయన తనతో మాట్లాడినట్లు వివరించారు. దీనిపై విపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడిన కుమారస్వామి.. ప్రజల దృష్టిమరల్చేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు తీసుకొని బదిలీలు చేసినట్లు ఆధారాలు చూపిస్తే రాజకీయాల నుంచి వైదులుగుతానని విపక్షాలకు సిద్ధరామయ్య సవాల్ విసిరారు.
అటు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సైతం యతీంద్రకు బాసటగా నిలిచారు. యతీంద్ర.. సీఎస్ఆర్ నిధుల వినియోగం గురించే మాట్లాడారని అన్నారు. కర్ణాటక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సభ్యుడిగా, ఆశ్రయ సమితి ఛైర్మన్‌గా యతీంద్ర బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
ఆవు పేడను విసురుకుంటూ పండగ- చొక్కాలు విప్పి ఒకరిపై ఒకరు!
అయోధ్య రాముడిని దర్శించుకున్న 2లక్షల మంది- ఆ ట్రయల్స్ సక్సెస్- త్వరలో 3లక్షల మంది!