తొమ్మిదవ సిక్కు గురువు గురు తేగ్ బహదూర్ ప్రస్తావన లేకుండా గత నాలుగు శతాబ్దాలలో భారతదేశ చరిత్రను ఊహించలేమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తేగ్ బహదూర్ (ప్రకాశ్ పూరబ్) 400వ జయంతిని పురస్కరించుకుని గురువారం వర్చువల్‌గా జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 400వ జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు.
"గత నాలుగు శతాబ్దాలలో, గురు తేగ్ బహదూర్ ప్రభావం లేని భారత్‌ను ఊహించలేం. మనందరికీ ఆయన స్ఫూర్తిప్రదాత. గురు నానక్ నుంచి గురు తేగ్ బహదూర్, గురు గోవింద్ సింగ్ వరకు, సిక్కు గురు సంప్రదాయం ఆదర్శ జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
గురు తేగ్‌బాహదూర్ బోధనలతో పాటు మొత్తం గురు సంప్రదాయాన్ని ప్రపంచానికి భారతీయులు పరిచయం చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు.
![Can't imagine any period in last 4 centuries without Guru Tegh Bahadur's influence: PM Modi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11328419_yv.jpg)
మోదీతో పాటు ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్‌షా, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ పాల్గొన్నారు.
మోదీకి పంజాబ్ సీఎం వినతి..
తేగ్ బహదూర్‌కు ఘనమైన నివాళి ఇచ్చేలా రూ.937 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆరంభించడానికి పంజాబ్ ప్రభుత్వ ప్రతిపాదనను ఆమోదించాలని మోదీని అమరీందర్ సింగ్ కోరారు. ఈ ప్రతిపాదనలో శ్రీ ఆనంద్‌పుర్ సాహిబ్‌ను స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయాలని కూడా ఉన్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: కరోనా ఉద్ధృతిపై నేడు ముఖ్యమంత్రులతో మోదీ భేటీ