మరో దఫా స్పెక్ట్రమ్ వేలానికి కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. 20 ఏళ్లకు పలు ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో స్పెక్ట్రమ్‌ను మార్చిలో వేలం వేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. దీని ద్వారా రూ. 3,92,332కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది. స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి ఈ నెలలోనే దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ చెప్పారు.
ఇదే సమయంలో దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని టెలికాం రంగంపై నేషనల్ సెక్యూరిటీ డైరెక్టివ్‌ను ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ డైరెక్టివ్ నిబంధనల ప్రకారం.. టెలికాం రంగంలో ఉపయోగించే విశ్వసనీయమైన పరికరాలను కేంద్రం సూచిస్తుందని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.
చెరకు రైతులకు ఊరట!
చెరకు రైతులకు ఉపశమనం కల్పిస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది. 60 లక్షల టన్నుల పంచదార ఎగుమతికి ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన రూ.3,500 కోట్ల రాయితీని నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ చేయాలని తీర్మానించింది. ఈ నిర్ణయంతో 5 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని కేంద్రం తెలిపింది.