Road Accident: కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు ప్రయాణికులు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
మృతుల్లో విద్యార్థులు అమూల్య(18), అజిత్(16), షాహ్నావాజ్(18), కల్యాణ్(18), అజిత్ సూలనయకనహల్లిగా (17) గుర్తించారు పోలీసులు. క్షతగాత్రులను తుమకూర్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. బస్సులో సామర్థ్యానికి మించి 60 మందికిపైగా ఓవర్లోడ్తో వెళ్లటమే ప్రమాదానికి కారణమైనట్లు తెలిపారు. పవగడ నగరం నుంచి వైఎన్ హోసకోటే గ్రామానికి వెళ్తున్న క్రమంలో పలవల్లి కట్టే సమీపంలో బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయి బోల్తా పడిందన్నారు.
ఎమ్మెల్యే సంతాపం..
బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు స్థానికి ఎమ్మెల్యే వెంకటరమణప్ప. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. 'బాధిత కుటుంబాలకు పరిహారం అందించేలా ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైతో మాట్లాడతాను. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు బస్సుల కొరత లేదు. పలు బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇదే రూట్లో కొద్ది రోజుల క్రితం రెండు బస్సులు ఢీకొన్నాయి. ఆ రెండు బస్సులే ప్రస్తుతం పక్కన పెట్టాం. అందుకే ఈ బస్సులో ఎక్కువ మంది ప్రయాణికులు ఎక్కారు.' అని పేర్కొన్నారు.
పవగడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు ఉన్నతాధికారులు.