వ్యవసాయ చట్టాల రద్దుకు పట్టుబడుతూ విపక్షాలు చేసిన ఆందోళనలతో లోక్‌సభ సోమవారానికి వాయిదా పడింది. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం కాగానే సాగు చట్టాలను రద్దు చేయాలంటూ ప్రతిపక్ష నేతలు నినాదాలు చేశారు.
దీంతో జీరో అవర్ కొనసాగించాలని స్పీకర్ ఓంబిర్లా విజ్ఞప్తి చేసినా ప్రతిపక్షాలు వినలేదు. విపక్షాల నినాదాల మధ్యే కరోనా టీకాపై అనుబంధ ప్రశ్నలకు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ సమాధానం ఇచ్చారు.
పలువురు సభ్యులు వెల్‌లోకి దూసుకువచ్చి నిరసన వ్యక్తం చేశారు. వెనక్కి వెళ్లాలని స్పీకర్ ఓంబిర్లా పదే పదే సూచించినా.. సభ్యులు నిరసనలు కొనసాగించడంతో సభను స్పీకర్ సాయంత్రం ఆరు గంటలకు వాయిదా వేశారు. మళ్లీ సభ ప్రారంభంకాగానే.. విపక్ష నేతలు ఆందోళన కొనసాగించారు.
కాంగ్రెస్, వామపక్షాలు, డీఎంకే సభ్యులు సాగు చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.