ఈశాన్య రాష్ట్రం అసోంలోని స్వయంప్రతిపత్తి ప్రాంతం బోడోల్యాండ్ ప్రాదేశిక మండలి (బీటీసీ) ఎన్నికల ఫలితాల్లో ఏ ఒక్క పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాలేదు. 40 మంది సభ్యుల మండలిలో అధికార బోడో పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్) 17 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినా.. మెజారిటీ ఫిగర్‌ను అందుకోలేకపోయింది. యునైటెడ్ పీపుల్స్ లిబరేషన్ (యూపీపీఎల్)కు 12 సీట్లు రాగా.. భాజపా 9 స్థానాలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, గాన సురక్ష పార్టీ( జీఎస్పీ) తలో సీటుతో సరిపెట్టుకున్నాయి.
పుంజుకున్న భాజపా..
రాష్ట్ర ప్రభుత్వంలో బీపీఎఫ్, భాజపా కూటమిగా ఉండగా.. ఈసారి బీటీసీ ఎన్నికల్లో వేరు వేరుగా పోటీలో నిలిచాయి. ప్రచారంలో ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నాయి. 2015లో జరిగిన ఎన్నికల్లో భాజపాకు కేవలం ఒకే సీటు రాగా.. ఇప్పుడు 9 సీట్లు దక్కాయి.
కొత్త కూటమిపై..
ప్రస్తుతం హంగ్ ఏర్పడిన క్రమంలో కొత్త భాగస్వామ్యాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. భాజపా, యూపీపీఎల్ పొత్తుపై అధికారిక ప్రకటన చేయకపోయినప్పటికీ.. ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే కూటమిగా ఏర్పడేందుకు సానుకూలంగా ఉన్నట్లు ఇప్పటికే సంకేతాలిచ్చాయి. ఎన్నికల ఫలితాలపై.. యూపీపీఎల్ అధినేత ప్రమోద్ బ్రహ్మతో భాజపా మంత్రి హిమాంత బిశ్వ శర్మ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రంజిత్ కుమార్ దాస్, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ దిలీప్ సైకియా శనివారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ఈ ఇరుపార్టీల భాగస్వామ్యంపై ఆదివారం సాయంత్రం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్‌తో చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు భాజపా నేత శర్మ.
శాంతి ఒప్పందం తర్వాత తొలి ఎన్నికలు..
స్వరాష్ట్ర కాంక్షతో ఇంతకాలం సాయుధ పోరుకు సారథ్యం వహించిన నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోల్యాండ్ (ఎన్‌డీఎఫ్‌బీ) పరిధిలోని నాలుగు వర్గాలతో ఈ ఏడాది జనవరి 27న కొత్త ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత బీటీసీకి తొలి ఎన్నికలు కావటం వల్ల ప్రాధాన్యం ఏర్పడింది. బోడోల్యాండ్ ప్రాదేశిక ప్రాంతం (బీటీఆర్) పరిధిలోకి వచ్చే కోక్రాఝర్, చిరాంగ్, బక్సా, ఉదల్గురి జిల్లాల్లో డిసెంబర్ 7, 10వ తేదీల్లో ఎన్నికలు జరిగాయి.
వచ్చే ఏడాది ఏప్రిల్‌లో అసోం శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ బీటీసీ ఎన్నికలను సెమీఫైనల్‌గా భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు.
ఇదీ చూడండి: 'బోడో' ఒప్పందంతో చిరశాంతి రహిస్తుందా?