కరోనా వ్యాక్సిన్ల అత్యవసర వినియోగంతో ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచ దేశాల మీద 'కొత్త రకం' వైరస్ వార్త పిడుగులా పడింది. కరోనా సృష్టించిన బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాల ప్రజలు.. బ్రిటన్‌లో వెలుగుచూసిన ఈ కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్‌పై ఆందోళన చెందుతున్నారు. అయితే.. అసలు ఏంటి ఈ కొత్త స్ట్రెయిన్? దీని ప్రభావమెంత? భయపడాల్సిన అవసరం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం.. ఆంధ్రప్రదేశ్ కొవిడ్ నోడల్ అధికారి, ప్రొఫెసర్ డా. రాంబాబు మాటల్లో..
- ఈ స్ట్రైయిన్ని వీయూఐ 202012/01 అని పిలుస్తారు. వీయూఐ అంటే వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్. ఇది కొత్త వేరియంట్ మాత్రమే. కొత్త వైరస్ కాదు.
- వైరస్ పరిణామంలో అనేక జన్యుమార్పిళ్లు జరుగుతాయి. ఈ జన్యుమార్పిళ్లలో కొన్ని బాగా ప్రభావవంతమైనవి వచ్చే అవకాశం ఉంటుంది. అందులో.. ఈ మార్పు బాగా ప్రభావితమైనది అని తెలుస్తోంది.
- ఈ కొత్త వేరియంట్లలో సుమారుగా 17 వరకు జన్యుమార్పిళ్లు ఉన్నాయని గుర్తించారు.
- అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది ఎన్501వై. దీనికి అర్థం.. 501 పొజిషన్లో ఆస్పర్జిన్ అనే అమినోయాసిడ్ మారిపోయి.. టైరోసీన్ అనే అమినోయాసిడ్ ఉండటం.
- ఈ మ్యుటేషన్ వల్ల ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది సుమారుగా 70శాతం ఎక్కువగా వ్యాప్తి చెందొచ్చు.
- ఈ మ్యుటేషన్.. స్పైక్ ప్రోటీన్‌లోని రిసెప్టార్స్ బైండింగ్ ప్రోటీన్‌లో ఉంది. దీని వల్ల వైరస్ మనిషి కణజాలంలోని ఏసీఈ-2 అనే రిసెప్టార్స్కు ఎక్కువగా అంటుకునే ప్రమాదం ఉంది.
- ఈ మ్యుటేషన్‌తో పాటు 69/70 ప్రాంతంలో అమినోయాసిడ్ డిలీషన్స్ కూడా కనపడ్డాయి. వీటిని డెల్టా హెచ్ 69, డెల్టా వి 70 అని పిలుస్తారు. ఈ మ్యుటేషన్స్ వల్ల ఈ వైరస్.. రోగ నిరోధక శక్తి నుంచి తప్పించుకునే అవకాశం ఉంది.
- పీ681హెచ్ అనే మరొక మ్యుటేషన్ కూడా ఈ వైరస్ వేరియంట్లో కనిపించింది.
- ఈ వేరియంట్‌ను మొట్టమొదటిసారిగా బ్రిటన్‌లో కనుక్కున్నారు. అయితే ఇది ఇప్పుడే డెన్మార్క్‌లోనూ కనిపించటం విశేషం. దక్షిణాఫ్రికాలో మరొక వేరియంట్ కూడా వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలుస్తోంది. దక్షిణాఫ్రికన్ వేరియంట్లో కూడా ఈ ఎన్501వై మ్యుటేషన్ ఉందని సమాచారం.
- ఈ వేరియంట్ వల్ల కరోనా వైరస్‌తో మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా ఎలాంటి దాఖలాలు లేవు.
- ఈ వేరియంట్ వల్ల వ్యాక్సిన్ పనికి రాకుండా పోయే అవకాశం ఉన్నట్లుగా కూడా ఎలాంటి ఆధారం లేదు.
- అయితే ఈ వేరియంట్ బాగా వేగంగా వ్యాప్తి చెందడం వల్ల బ్రిటన్ కలవరపడుతోంది. ఇప్పటికే అక్కడ ఆంక్షలు బాగా పెంచారు. క్రిస్మస్ వేడుకలు కూడా తగ్గించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విమానాలను కూడా రద్దు చేశారు. యూకే నుంచి వచ్చే విమానాల్ని అనేక ఐరోపా దేశాలు రద్దు చేశాయి.
- ఏదేమైనప్పటికీ వైరస్ పరిణామక్రమంలో అనేక మార్పులు జరిగే అవకాశం ఉన్నందున ఈ వైరస్‌ను ఎంత తొందరగా మనం నియంత్రించగలిగితే అంత మంచిది.
'భయపడాల్సిన పనిలేదు..'
బ్రిటన్‌లో కొత్త రకం వైరస్ వినాశకర రీతిలో ప్రభావం చూపించడం లేదని భారతీయ ప్రజారోగ్య సంస్థ ఛైర్మన్, డబ్ల్యూహెచ్ఓ స్టీరింగ్ కమిటీ సభ్యుడు డా. శ్రీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిగణిస్తే.. వైరస్ రూపు మారినా అంత అపాయకరంగా ఏమీ దాడి చేయడం లేదని తెలుస్తున్నట్టు వివరించారు.
ఇదీ చూడండి:- బ్రిటన్ నుంచి ఇటలీకి పాకిన 'కొత్త రకం' కరోనా