కరోనా మహమ్మారితో దేశం అల్లాడుతుంటే.. మరోవైపు బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. దీనిని కూడా మహమ్మారిగా ప్రకటించి.. రోగులకు అత్యవసర చికిత్స ఇవ్వాలని కేంద్రం గురువారం ఆదేశించింది. కొద్ది రోజులుగా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల హెచ్చరిస్తూ వస్తోంది.
ఈ నేపథ్యంలోనే.. బ్లాక్ ఫంగస్ చికిత్సలో ఉపయోగించే ఆంఫోటెరిసిన్- బి ఔషధం దేశీయ ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంకా.. ప్రపంచ దేశాల తయారీదారుల నుంచి దిగుమతి చేసుకొని దేశీయంగా అందుబాటులో ఉంచేందుకు చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు పేర్కొంది.
మరో ఐదు సంస్థలకు అనుమతి..
ఈ డ్రగ్ కొరతను అధిగమించేందుకు మరో ఐదు సంస్థలను.. ఉత్పత్తి చేసేందుకు అనుమతించింది కేంద్రం. ఇప్పటికే ఆరు కంపెనీలు ఈ ఔషధాన్ని తయారు చేస్తున్నాయి.
ఈ ఐదు సంస్థలు జులైలోనే ఉత్పత్తి ప్రారంభిస్తాయని, నెలకు లక్షా 11 వేల వయల్స్ అందుబాటులోకి తీసుకొస్తాయని ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం జూన్ వరకు దేశీయంగా ఆంఫోటెరిసిన్ వయల్స్ 5 లక్షల 70 వేలకు మించుతాయని స్పష్టం చేసింది.
దిల్లీలో 200 కేసులు!
దేశరాజధానిలో బుధవారం రాత్రి వరకు 197 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. బాధితుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారని పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకే స్టెరాయిడ్లను వాడాలని సూచించారు.
13 ఏళ్ల బాలుడికి బ్లాక్ ఫంగస్..
గుజరాత్లో 13 సంవత్సరాల బాలుడికి బ్లాక్ ఫంగస్ సోకింది. ఈ వయసులో బ్లాక్ ఫంగస్ బారినపడటం రాష్ట్రంలో ఇదే తొలిసారి. అంతకుముందు కరోనాను జయించిన ఆ బాలుడికి అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించినట్లు వైద్యులు పేర్కొన్నారు.
బ్లాక్ ఫంగస్ అంటే..
బ్లాక్ ఫంగస్‌ను మ్యూకోర్ మైకోసిస్ అని అంటారు. మధుమేహం ఉన్న వారు కోవిడ్ చికిత్సలో స్టెరాయిడ్స్ వాడితే బ్లాక్ ఫంగస్ సులభంగా సోకుతుంది. అందువల్ల.. చక్కెర నిల్వలు అధికంగా ఉన్న, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న కరోనా రోగుల్లో దీని ముప్పు ఎక్కువ. కేన్సర్, అవయవ మార్పిడి ఇతరత్రా ఆరోగ్య సమస్యలున్నవారు, ఒరికొనజోల్ చికిత్స తీసుకున్న వారికీ ముప్పు ఎక్కువే.
ఇవీ చూడండి: అందుబాటులోకి బ్లాక్ ఫంగస్ వ్యతిరేక ఔషధం