అసోం, కేరళ, తమిళనాడులో ఇంకా ప్రకటించని స్థానాలకు అభ్యర్థులను భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ) ఖరారు చేసింది. బంగాల్లో మూడు, నాలుగో దశ అభ్యర్థుల ఎంపికపైనా తుది నిర్ణయం తీసుకుంది. దిల్లీలో శనివారం భాజపా సీఈసీ సమావేశం శనివారం జరిగింది. ఈ భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ తరపున అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడానికి భాజపా సీఈసీ భేటీ కావడం ఇది రెండో సారి.
బంగాల్లో మరో 80 మంది..
బంగాల్లో ఇప్పటికే 58 మంది అభ్యర్థుల పేర్లను భాజపా ప్రకటించింది. తాజాగా మూడు, నాలుగో దశ ఎన్నికల కోసం 80 మంది అభ్యర్థులను ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
"మేము ప్రధానంగా మూడో, నాలుగో దశలో పోటే చేసే స్థానాల గురించి మాట్లాడాం. దాదాపు 80 సీట్లను ఖరారు చేశారని అనుకుంటున్నాను. ఆదివారం దీనిపై ప్రకటన వెలువడుతుంది."
- బంగాల్ భాజపా అధ్యక్షుడు రాజీవ్ బెనర్జీ
బంగాల్ అసెంబ్లీకి 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 27న ప్రారంభమై.. ఏప్రిల్ 29న చివరి దశతో ఎన్నికలు ముగియనున్నాయి.
కేరళలో 115 స్థానాల్లో..
భాజపా సీఈసీ సమావేశం అనంతరం కేరళ భాజపా అధ్యక్షుడు కే సురేంద్రన్ మాట్లాడారు. కేరళలో 115 స్థానాల్లో భాజపా పోటీ చేయనుందని తెలిపారు. మిగతా 25 స్థానాలను మిత్ర పక్షాలకు కేటాయించినట్లు చెప్పారు. అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రకటిస్తామని స్పష్టం చేశారు.
తమిళనాడులో ఆల్ క్లియర్
తమిళనాడులో స్థానాలపై కూడా భాజపా సీఈసీ భేటీలో చర్చించారు. పోటీచేసే 20 స్థానాలకుగాను 18 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. ఇటీవల భాజపాలో చేరిన సినీ నటి ఖుష్భూ సహా మాజీ ఐపీఎస్ అధికారి కే అన్నామలైకి సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.
తమిళనాడులోని అన్నిస్థానాల అభ్యర్థుల గురించి ఆ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు.. సీఈసీ భేటీలో చర్చించారని పార్టీ వర్గాలు తెలిపాయి. అభ్యర్థుల తుది జాబితాను త్వరలోనే విడుదల చేయనున్నామని చెప్పాయి.
అసోం మూడోదశపై..
అసోం మూడో దశ ఎన్నికల్లో పోటీ పడే అభ్యర్థుల పేర్లనూ సీఈసీ భేటీలో ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6న మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 6న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మే 2న ఉంటుంది.
ఇవీ చూడండి: