Maharastra Political Crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఇంకా కొలిక్కి రాలేదు. శివసేన రెబల్ ఎమ్మెల్యేలు పట్టు వీడటం లేదు. అసోంలోని గువాహటి క్యాంప్ నుంచి బయటకు అడుగుపెట్టడం లేదు. ఏక్‌నాథ్ శిందేతోనే ఉంటామని తేల్చిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో శివసేన సొంత పత్రిక 'సామ్నా' ప్రచురించిన కథనం ప్రాధాన్యం సంతరించుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు లేవనెత్తిన ఆ రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ శిందే, రెబల్ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు గుప్పించింది. తిరుగు బాటు నేతలకు కేంద్రం వై-ప్లస్ కేటగిరి భద్రతను కల్పించడాన్ని చూస్తే వారి వెనక భాజపా ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని కథనం ప్రచురించింది. ఏక్‌నాథ్ నేతృత్వంలోని రెబల్ ఎమ్మెల్యేలు రూ.50 కోట్లకు అమ్ముడుపోయారని, స్క్రిప్ట్ అంతా భాజపాదేనని ఆరోపించింది.
మరోవైపు శివసేన శాసనసభాపక్ష నేతగా తనను తొలగిస్తూ డిప్యూటీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై శిందే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు.. సోమవారం విచారణ జరపనుంది. ప్రస్తుతం అసోంలోని గువహటి హోటల్‌లో ఉన్న శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు.. మధ్యాహ్నం 2 గంటలకు ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యచరణ, తదుపరి వ్యూహాలు చర్చించనున్నట్లు సమాచారం. మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేన వ్యవస్థాపకుడు రాజ్ ఠాక్రేతో ఏక్‌నాథ్ శిందే సోమవారం ఉదయం ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిసింది. మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించినట్లు ఎమ్ఎన్ఎస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి
ఇవీ చదవండి: క్షుద్రపూజలతో మహిళ హత్య.. పేగులు తీసి.. ముక్కలుగా నరికి దహనం