భాజపా ఎంపీ కాన్వాయ్ కింద పడి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర్‌ప్రదేశ్ బస్తీ జిల్లాలోని బసియా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రెండో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలుడు.. స్థానిక ప్రైమరీ స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా.. భాజపా ఎంపీ హరీశ్ ద్వివేది కాన్వాయ్ ఢీకొట్టింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఘటన జరిగిందని బాలుడి కుటుంబ సభ్యులు తెలిపారు.
"రోడ్డు దాటుతుండగా నా కొడుకును ఎంపీ కారు ఢీకొట్టింది. వెంటనే వాడిని ఆస్పత్రికి తీసుకెళ్లాం. ప్రాథమిక చికిత్స అనంతరం లఖ్‌నవూ లోని మరో ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సిఫార్సు చేశారు. లఖ్‌నవూకు వెళ్తుండగా మధ్యలో కప్తాన్‌గంజ్ వద్ద ఆగాం. నా కుమారుడిని పరిశీలించాం. ఊపిరి తీసుకోవడం ఆగిపోయిందని అప్పుడు తెలిసింది" అని బాలుడి తండ్రి శత్రుఘన్ రాజ్‌భర్ తెలిపారు.
ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీలో నమోదయ్యాయి. బాలుడిని ఢీకొట్టగానే ఎంపీ కిందకు దిగి.. ఘటనాస్థలిని పరిశీలించడం వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనలో కారు ముందు భాగం కాస్త దెబ్బతిన్నట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎంపీతో పాటు పలువురిపై ఫిర్యాదు నమోదైనట్లు డీఎస్పీ అలోక్ ప్రసాద్ చెప్పారు. "ఓ ఫార్చునర్ కారు ఢీకొట్టిందని బాలుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అందులో ఓ ప్రజాప్రతినిధి ఉన్నారని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం" అని అలోక్ ప్రసాద్ వివరించారు.