ప్రపంచంలోనే భాజపా అతిపెద్ద దోపిడిదారు అని బంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. ఆ పార్టీని బంగాల్లో పరిపాలించడానికి ఎన్నటికీ అనుమతించబోమన్నారు. పూర్వ మేద్నిపుర్ జిల్లా హాల్దియాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు దీదీ. దళిత బాలికలను భాజపా వేధింపులకు గురిచేస్తోందని, ప్రజలపై హింసకు పాల్పడుతోందని ఆరోపించారు.
"ప్రపంచంలో అతిపెద్ద దోపిడిదారు.. భాజపా. పీఎం కేర్ నిధుల పేరుతో ఎన్ని డబ్బులు దోచుకుందో మీరే చూడండి. బంగాల్ ప్రజలు శాంతి, అల్లర్లు లేకుండా ఉండాలని కోరుకుంటే టీఎంసీ ఒకటే సరైనది. ప్రధాన మంత్రి ప్రతిదానిని అమ్మేశారు. భారత ఆర్థిక వ్యవస్థను దిగజార్చారు. రైల్వేను, బొగ్గు రంగాన్ని, బీఎస్ఎన్ఎల్, బీమా రంగాన్ని, బ్యాంకులను అన్నింటినీ కేంద్ర ప్రభుత్వం.. ప్రైవేట్ పరం చేసింది. ఏదో రోజు హాల్దియా రేవును కూడా ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతుంది."
- మమతా బెనర్జీ, తృణమూల్ అధినేత్రి
రాష్ట్రంలోని రైతులకు ఇచ్చే సాయాన్ని రూ.6,000 నుంచి రూ.15,000కు పెంచుతామని మమత హామీనిచ్చారు. రేషన్ సరకులను ఇంటి వద్దకే ఉచితంగా చేరవేస్తామని చెప్పారు.
ఖేజురిలో దీదీ..
భూస్వాముల పార్టీ భాజపా అని ఖేజురి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మమత విమర్శించారు. లక్షల కోట్ల రూపాయల నిధులను దోచుకుందని ఆరోపించారు. నోట్ల రద్దు చేసినప్పటి డబ్బు, పీఎం కేర్స్ నిధుల వివరాలను భాజపా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
బంగాల్లో మార్చి 27 నుంచి ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఎనిమిది దశల్లో పోలింగ్ జరగనుంది.
ఇదీ చూడండి:మంచి మనసు చాటుకున్న సింధియా