శానిటరీ నాప్కిన్స్పై ఓ విద్యార్థి ప్రశ్నకు 'కండోమ్‌లు కూడా ఉచితంగా ఇవ్వాలా?' అంటూ వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారిణి హర్‍జోత్ కౌర్ చిక్కుల్లో పడ్డారు. పాఠశాల బాలికలతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయటంపై దూమారం చెలరేగటం వల్ల ఇప్పటికే వివరణ ఇవ్వాలని ఆమెను ఉన్నతాధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది.
మరోవైపు.. ఐఏఎస్ అధికారిణి హర్‌జోత్ కౌర్‌పై చర్యలు తీసుకుంటామని సూత్రప్రాయంగా తెలిపారు బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్. ఆమె వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయనే కారణంతో సీఎం సీరియస్‌గా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్ 27న జరిగిన కార్యక్రమంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారిణిని వివరణ ఇవ్వాలని ఇప్పటికే జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) నోటీసులు జారీ చేసింది.
'నా వ్యాఖ్యలపై పశ్చాత్తాపడుతున్నా'
తన వ్యాఖ్యలు పట్ల వివాదం చెలరేగడం వల్ల మహిళా ఐఏఎస్ అధికారిణి హర్‍జోత్ కౌర్ బుమ్రా విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. 'నేను ఎవరినీ కించపరచాలని, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలని అలా వ్యాఖ్యానించలేదు. నా వ్యాఖ్యలపై పశ్చాత్తాపడుతున్నా' అని ఆమె అన్నారు.
శానిటరీ ప్యాడ్స్‌ను ఉచితంగా ఇవ్వడంపై ఐఏఎస్‌ను ప్రశ్నించిన విద్యార్థిని రియా కుమారి కూడా ఈ ఘటనపై స్పందించారు. "నా ప్రశ్న (శానిటరీ ప్యాడ్‌లపై)తప్పు కాదు. శానిటరీ ప్యాడ్లను నేను కొనుక్కోగలను. మురికివాడల్లో నివసిస్తున్నవారు కొనుక్కోలేరు. అందుకే నేను నా కోసమే కాకుండా అమ్మాయిలందరి కోసం ఈ ప్రశ్న అడిగాను." అంటూ రియా కుమారి చెప్పుకొచ్చింది.
రూ.10 ఇవ్వాలంటూ..
ఝూర్ఖండ్ ధన్‌బాద్‌లోని ఓ పాఠశాలలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని తరగతి గదిలో ఉండగా పీరియడ్స్ వచ్చాయి. దీంతో ఆమె శానిటరీ ప్యాడ్స్ కోసం టీచర్‌ను అడిగింది. దీనికి ఉపాధ్యాయుడు రూ.10 ఇవ్వమని అడిగాడు. ఇబ్బందిగా ఉందని శానిటరీ ప్యాడ్స్ ఇవ్వమని బాలిక అభ్యర్థించినా టీచర్ పట్టించుకోలేదు.
రెండో అంతస్తులో ఉన్న వేరొక స్నేహితురాలి దగ్గరకు వెళ్లి బాలిక.. రూ.10 తెచ్చి ఇచ్చాక శానిటరీ ప్యాడ్‌ను ఇచ్చాడు టీచర్. సెప్టెంబరు 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటికి చేరుకున్న బాలిక.. స్కూల్లో జరిగిన ఘటనను కుటుంబ సభ్యులకు తెలిపింది. బాలిక తల్లి జిల్లా విద్యాశాఖ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. దీనిపై విద్యాశాఖ అధికారులు పాఠశాలకు చేరుకుని యజమాన్యాన్ని, ఉపాధ్యాయుడు, బాధితురాలు, ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. విచారణ నివేదిక అందిన వెంటనే ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని ధన్‌బాద్ జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.
ఇవీ చదవండి: 'సిగ్నల్ జంప్ చేశా.. ఫైన్ కట్టొచ్చా?'.. బిర్లా ట్వీట్‌కు పోలీసుల షాకింగ్ రిప్లై