Bigg Boss Telugu Winner Pallavi Prashanth as A1 : రైతుబిడ్డగా బిగ్‌బాస్‌లోకి వెళ్లి సెన్సేషన్ క్రియేట్ చేసిన టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ బయటకు రాగానే వివాదాల్లో చిక్కుకున్నాడు. జూబ్లీహిల్స్‌లో వాహనాల ధ్వంసం, దాడి ఘటనలో పల్లవి ప్రశాంత్ ప్రధాన నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు. అతని సోదరుడు, స్నేహితుడిని కూడా నిందితులుగా నమోదు చేసి మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
Bigg Boss Telugu Winner Pallavi Prashanth Absconded : రెండు కార్లను సీజ్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ రవీంద్రప్రసాద్ తెలిపారు. బిగ్‌బాస్ తుది పోటీల నేపథ్యంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 5లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన దాడులకు పల్లవి ప్రశాంత్ కారణమని పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఏ-1గా పల్లవి ప్రశాంత్‌ను చేర్చగా, ఏ-2గా అతని సోదరుడు మనోహర్‌ను, ఏ-3గా అతని స్నేహితుడు వినయ్‌ను చేర్చారు. ఏ-4గా మరో ముగ్గురిని గుర్తించి అరెస్టు చేశారు.
Pallavi Prashanth Absconded : ఎఫ్ఐఆర్ కాపీని తీసుకునేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పల్లవి ప్రశాంత్ తరఫు న్యాయవాది రాజ్‌కుమార్ వెళ్లారు. ముందస్తు బెయిల్ కోసం పీఎస్‌కు వెళ్లిన అతడికి పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. నిందితుడు లేదా అతడి న్యాయవాదికి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం కుదరదని పోలీసులు తేల్చి చెప్పినట్లు తెలిసింది. పీఎస్ నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియాతో పల్లవి ప్రశాంత్ తరఫు న్యాయవాది మాట్లాడారు.
బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్‌పై కేసు నమోదు
రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదని పల్లవి ప్రశాంత్ తరఫు న్యాయవాది రాజ్ కుమార్ అన్నారు. కేసు నమోదు చేసి కనీసం నిందితుడికి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. పల్లవి ప్రశాంత్ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని, అందుకే అతడి స్థానంలో తాను ఎఫ్ఐఆర్ కాపీ కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లు చెప్పారు.
"అయితే ఇన్‌స్పెక్టర్ మాత్రం ఎఫ్ఐఆర్ కాపీని నిందితుడి కుటుంబ సభ్యులకే ఇస్తామని చెబుతున్నారు. నిజానికి ఎఫ్ఐఆర్ కాపీని పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. ఆ బాధ్యత పోలీసులది. ఎఫ్ఐఆర్ కాపీ లేకపోవడం వల్ల బెయిల్‌కు దరఖాస్తు చేయలేకపోతున్నాం. అసలు ఎఫ్ఐఆర్ కాపీ చూస్తేనే పల్లవి ప్రశాంత్‌పై ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారన్న విషయం తెలుస్తుంది." - రాజ్ కుమార్, పల్లవి ప్రశాంత్ తరఫు న్యాయవాది
అసలేం జరిగిందంటే : బిగ్‌బాస్ సీజన్-7 ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ అయిపోగానే విన్నర్ పల్లవి ప్రశాంత్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి బయటకు వస్తూనే ర్యాలీ తీశాడు. అయితే అనుమతి లేకుండా ర్యాలీ చేయడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతే కాకుండా బిగ్‌బాస్ ఫైనల్స్ నేపథ్యంలో ఆదివారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు చేరుకున్న పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు రెచ్చిపోయి అమర్‌దీప్ కారుపై రాళ్లు విసిరేందుకు యత్నించారు. మరో పోటీదారు అశ్వినీ కారు అద్దాలను పగులగొట్టారు. దాదాపు ఐదుకు పైగా ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట ఏసీపీ మోహన్‌కుమార్ కారు అద్దంతో పాటు విధులు నిర్వర్తించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా ధ్వంసం చేశారు.
ఈ అల్లర్లతో పాటు పోలీసుల హెచ్చరికలను పట్టించుకోకుండా ర్యాలీని నిర్వహించినందుకు కారణమైన పల్లవి ప్రశాంత్, అతడి డ్రైవర్‌పైనా కేసు నమోదు చేశారు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.
ఇదేం అభిమానం - బిగ్‌బాస్ ఫ్యాన్స్‌పై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఫైర్
విన్నర్ నేనే, నాకు తెలుసు'- శివాజీ రెమ్యునరేషన్ అన్ని లక్షలా? ప్రశాంత్ కంటే ఎక్కువ జాక్‌పాట్!