ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖకు సంబంధించి కఠిన నిర్ణయం తీసుకుంది. దీపావళికి ముందు ఏకంగా 25 వేల హోంగార్డులను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానిస్టేబుళ్లకు సమానంగా హోంగార్డులకు జీతం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించిన... అనంతరం యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఏడాదిలోనే...
పోలీస్ శాఖలో ఖాళీలను పూడ్చడానికి గతేడాది 25 వేల మంది హోంగార్డులను ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. వీరిలో అనేక మంది ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థలోనే పనిచేస్తున్నారు. వీరిని తొలగిస్తే ట్రాఫిక్ సమస్య పెరిగిపోయే అవకాశముంది.
వీరితో పాటు 99 వేల హోంగార్డుల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ప్రభుత్వం వారి పని దినాలను 25 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించడమే ఇందుకు కారణం.
లెక్కలతోనే చిక్కులు...
ఆర్థిక సమస్య వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి తెలిపారు.
హోంగార్డులకు రోజువారీ జీతం రూ. 500గా ఉండేది. సుప్రీంకోర్టు ఆదేశాలతో అది రూ.672కు చేరింది. దీని వల్ల ఉత్తర్ప్రదేశ్ పోలీసు శాఖలో ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తాయి.
హోంగార్డులకు నెల జీతం విధానం లేదు. పనిదినాల ఆధారంగానే జీతం అందుతుంది.
ఇదీ చూడండి: బ్యాటింగ్, బౌలింగ్ వీడి.. నటన వైపు భారత క్రికెటర్లు!