చక్కగా చదువుకుని పరీక్షలో పాసై ఉన్నతస్థాయికి ఎదగాలని బోధించాల్సిన వ్యక్తి ఆయన. కానీ ఎలా కాపీ కొట్టాలో విద్యార్థులకు బోధిస్తూ అడ్డంగా బుక్కయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మావో జిల్లాలో ఈ ఘటన జరిగింది.
యూపీలో మంగళవారం నుంచి బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మావో జిల్లాలోని హరివంశ్ మెమోరియల్ ఇంటర్ కాలేజీ యాజమాన్యం తమ విద్యార్థులను పరీక్షలకు సమాయత్తం చేసేందుకు ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాఠశాల ప్రిన్సిపల్, మేనేజర్ ప్రవీణ్ మాల్ విద్యార్థులకు కాపీ ఎలా కొట్టాలో హితబోధ చేశాడు. ప్రభుత్వ పాఠశాలల్లో తనకు చాలామంది మిత్రులున్నారని, ఎలాంటి భయం లేకుండా పరీక్షలు రాయాలని తెలిపాడు.
"చిట్టీలు మీ దగ్గరే ఉంచుకోకండి. ముందు వెనక ఉన్న వారికి అందిస్తూ ఉండండి. మీకు నచ్చినట్లు చేయండి. కానీ బాగా రాయండి. ఒక వేళ ఎవరైనా పట్టుకుని కొడితే... ఇంకొక దెబ్బ కొట్టమనండి. క్షమించమని అడగండి. మీకు ఏం కాదు. కాదని రెచ్చిపోతే మొత్తం కళాశాలకే నష్టం. ఎవరు ఏ ప్రశ్ననీ వదలకూడదు. రాయండి.. జవాబుపత్రం ఇచ్చేటప్పుడు 100 రూపాయలు అందులో పెట్టి వెళ్లండి."
- ప్రవీణ్ మాల్, కళాశాల ప్రిన్సిపల్
ఫిర్యాదుతో వెలుగులోకి..
ఓ విద్యార్థి ప్రిన్సిపల్ మాటలను రహస్యంగా రికార్డు చేసి గ్రీవెన్స్‌సెల్‌లో ఫిర్యాదు చేయడం వల్ల ఆయన నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై విచారణకు ఆదేశించినట్లు మావో జిల్లా మెజిస్ట్రేట్ గ్యాన్ ప్రకాశ్ త్రిపాఠి వెల్లడించారు.