- బంగాల్ ఓటర్ల సంఖ్య: 7.18 కోట్లు
- మహిళా ఓటర్లు: 3.15 కోట్లు
ఈ గణాంకాలు చూస్తేనే అర్థమవుతుంది కదా!.. రాబోయే బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ప్రభావం ఎంత ఉందో? ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం ఈ సారి రాష్ట్రంలో మహిళా ఓటర్ల శాతం 49గా ఉంది. అంటే ఎన్నికల్లో గెలుపోటములను శాసించే స్థాయిలో మహిళా ఓటర్లు ఉన్నారు. ఇది గమనించిన మమతా బెనర్జీ ఇప్పటికే మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టేశారు. మరోవైపు భాజపా.. రాష్ట్రంలో మహిళలపై జరుగుతోన్న అన్యాయాలనే ఎన్నికల ప్రధాన అస్త్రంగా మలచుకోవాలని చూస్తోంది. మరి మహిళా ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపుతారు?
సంక్షేమ పథకాలు..
2009 లోక్‌సభ ఎన్నికల నుంచి రాష్ట్రంలో మహిళలు.. మమతా బెనర్జీ వెంటే ఉన్నారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో అధికసంఖ్యలో మహిళల ఓట్లు భాజపాకు దక్కాయి. ఇందుకు కారణం రాష్ట్రంలో మహిళలపై పెరిగిపోయిన అకృత్యాలు, అరాచకాలేనని భాజపా అంటోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ మహిళల ఓట్లు చేజారిపోకుండా మమతా ఇప్పటికే పలు మహిళా సంక్షేమ పథకాలు మొదలుపెట్టారు.
కన్యశ్రీ, రూపశ్రీ పేరుతో ఆడపిల్లలు, మహిళలకు ప్రయోజనం చేకూరేలా దీదీ మొదలుపెట్టిన ఈ పథకాలు ప్రజల్లోకి బాగానే వెళ్లాయన్నది విశ్లేషకుల మాట. అయితే మహిళల ఓట్లు రాబట్టడానికి పథకాలు సరిపోతాయా? అన్నది ఇక్కడ ప్రశ్న.
కాగితాలపైనే ఉన్నాయి..
భాజపా మాత్రం ఈ పథకాలపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇవి కేవలం కాగితాలపైనే ఉన్నాయని.. సాధారణ ప్రజలకు చేరటం లేదని ఆరోపిస్తోంది. ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను రాష్ట్రంలో అమలు కాకుండా దీదీ అడ్డుకుంటున్నారని విమర్శిస్తోంది.
"తృణమూల్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు మాత్రమే వాస్తవానికి ఈ పథకాల వల్ల లబ్ధి పొందుతున్నారు. మరోవైపు రాష్ట్రంలో మహిళలపై నేరాలు దారుణంగా పెరిగాయి. అత్యాచారాలు, మహిళలకు నిప్పు అట్టించడం బంగాల్లో సాధారణమైపోయింది. సీఎం మమతా బెనర్జీకి ఇవన్నీ చిన్న విషయాలుగా అనిపించడం దురదృష్టకరం.
- లాకెట్ ఛటోపాధ్యాయ్, భాజపా ఎంపీ
బూటకపు పథకాలు..
కాంగ్రెస్, సీపీఐ(ఎం)లు కూడా రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో దీన్నే ప్రచారాస్త్రంగా మలచుకుంటున్నాయి.
"రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక స్వావలంబన లేదు. ఈ కన్యశ్రీ, రూపశ్రీ పథకాలు అంతా ఓ బూటకం."
- మథుజా నేన్ రాయ్, సీపీఐ(ఎం)
కామ్దునీ, పార్క్ స్ట్రీట్ ఘటనలను మనం ఇంకా మర్చిపోలేదు. ఈ ఘటనలను చిన్న విషయాలుగా సీఎం మమతా బెనర్జీ కప్పిపుచ్చడాన్ని కూడా రాష్ట్రంలో మహిళలు మర్చిపోలేదు.
- ఇంద్రాణి గుప్తా, కాంగ్రెస్
భాజపా పాలిత రాష్ట్రాల్లోనే..
అయితే విపక్షాల విమర్శలను అధికార టీఎంసీ తోసిపుచ్చింది. బంగాల్లో మహిళలు భద్రంగా ఉన్నారని మహిళా సంక్షేమశాఖ మంత్రి శశి పంజా అన్నారు. జాతీయ నేర గణంకాల ప్రకారం భాజపా పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపై దారుణాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.
"దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే బంగాల్లోనే మహిళలు భద్రంగా, సురక్షితంగా ఉన్నారు. మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంది. దీదీ సర్కార్‌పై విపక్షాలు చేస్తోన్న ఆరోపణలు నిరాధారమైనవి. రాజకీయ విమర్శలు మాత్రమే."
- శశి పంజా, రాష్ట్ర మహిళా సంక్షేమ మంత్రి
మహిళా హక్కులు కాపాడండి..
దీదీ అమలు చేస్తోన్న మహిళా పథకాలను రాజకీయ విశ్లేషకులు స్వాగతిస్తున్నారు. అయితే మమత సర్కార్ మహిళా హక్కులను కాపాడటంపైనా దృష్టి సారించాలని సూచిస్తున్నారు.
"కన్యశ్రీ వంటి పథకాలు ఆడపిల్లలు పాఠశాలలకు వచ్చేలా ప్రోత్సహిస్తున్నాయన్నది వాస్తవం. అయితే ఇప్పటికీ రాష్ట్రంలో బాల్య వివాహాలు జరుగుతున్నాయి. ఇలాంటి పథకాలు తీసుకురావడం మాత్రమే కాకుండా మహిళా హక్కులను కాపాడేలా మమతా సర్కారు చర్యలు తీసుకోవడం కూడా ముఖ్యం."
- సంపూర్ణ గోస్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్, రాజకీయ శాస్త్రం
ఇవి తెలుసా?
- 2019 లోక్‌సభ ఎన్నికల్లో టీఎంసీ 17 మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది. భాజపా ఐదుగురిని బరిలోకి దింపింది.
- 2016 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 45మంది మహిళలకు సీట్లు ఇవ్వగా.. భాజపా 31 మందికి అవకాశం ఇచ్చింది.
- 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా పుంజుకోవడం వల్ల మమతా సర్కార్ 'బోంగో జనని' పేరుతో ఓ సంఘాన్ని ఏర్పాటు చేసింది.
- మహిళా సంక్షేమ పథకాల గురించి, భాజపా పాలిత రాష్ట్రాల్లో మహిళలపై పెరుగుతోన్న నేరాల గురించి ఇది ప్రచారం చేస్తోంది.
- రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో ఇచ్చే తుది ఓటర్ల జాబితాలో మహిళా ఓటర్లు 50 శాతం ఉంటే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తర్వాత ఈ ఘనత సాధించిన రాష్ట్రంగా బంగాల్ అవతరిస్తోంది.
బిహార్‌ను శాసించారు..
- 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ సీఎం కావడానికి ప్రధాన కారణం మహిళలు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేస్తానని ఆయన చేసిన హామీ మహిళల్లో విస్తృతంగా ప్రచారమైంది. ఫలితాల సరళి చూస్తే మహిళల ఓట్లన్నీ గంపగుత్తగా నితీశ్‌కే దక్కాయని తేలింది.
- 2020లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే తేలింది. ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి.. ఎన్డీఏకు గట్టి పోటీ ఇచ్చిన తరుణంలో మహిళలు మరోసారి నితీశ్‌ను కాపాడారు. ఎన్డీఏకు మహిళల ఆదరణ అధికంగా దక్కింది.
మరి ఇంతలా ఎన్నికల్లో మహిళల ప్రభావం ఉన్న నేపథ్యంలో బంగాల్లో బలపడుతోన్న భాజపాను నిలువరించి మరోసారి సీఎం పీఠాన్ని మమతా బెనర్జీ దక్కించుకుంటారా? లేదా? అనేది చూడాలి.
- సుమత్రా రాయ్ చౌదరి, ఈటీవీ భారత్
ఇవీ చూడండి: