క్రికెట్లో ఎన్ని ఓవర్లు బ్యాటింగ్ చేసినా.. చివరి బంతికి సిక్స్ కొడితే వచ్చే కిక్కే వేరు. అలాగే దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లో అధికారమున్నా.. దిల్లీ పీఠాన్ని అధిష్ఠించడంలో ఉన్న మజానే వేరు. ఎందుకంటే 'దిల్లీ' దేశ రాజధాని కాబట్టి. అందుకే భాజపా, కాంగ్రెస్ లాంటి జాతీయపార్టీలతో పాటు ప్రాంతీయపార్టీలు కూడా దిల్లీ గద్దె ఎక్కాలని ఉవ్విళ్లూరుతుంటాయి. అందుకు ఇప్పుడు మరో అవకాశం వచ్చింది. దిల్లీ శాసనసభ ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 8న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 11న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికలకు ఈనెల 14న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు జనవరి 21ని ఆఖరు తేదీగా నిర్ణయించారు. ఉపసంహరణకు 24 తుదిగడువు.
1998లో హస్తినలో అధికారాన్ని కోల్పోయిన భాజపా, అప్పటి నుంచి పదేళ్లకు పైగా దిల్లీని ఏలిన కాంగ్రెస్... రాజధానిలో తమ జెండాలను మరోమారు ఎగురవేయాలని ఇప్పుడు వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు 2015లో కనీవినీ ఎరుగని మెజారిటీతో రెండోసారి అధికారాన్ని చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్).. ప్రస్తుత ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. అదే సమయంలో దిల్లీ కూర్చీని అటు కమలం, ఇటు కాంగ్రెస్ నేతలకు అందని ద్రాక్షలా చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆప్, భాజపా, కాంగ్రెస్ పార్టీల్లో 2020 ఎన్నికల్లో గెలిచి దిల్లీ గద్దె ఎక్కేందుకు ఎవరికి ఎక్కువ అవకాశముందో చూద్దాం.
ఆప్ 'హ్యాట్రిక్' కొట్టేనా?
2013లో కాంగ్రెస్ సహకారంతో తొలిసారి అధికారాన్ని చేజిక్కించుకున్న కేజ్రీవాల్.. అవినీతికి అడ్డుకట్ట, అభివృద్ధి హామీలతో 2015 ఎన్నికల్లో 67 స్థానాల్లో గెలిచి అఖండ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అదే రీతిలో ప్రస్తుత ఎన్నికల్లోనూ గెలిచి ముచ్చటగా మూడోసారి దిల్లీ గద్దె ఎక్కాలని ఆప్ నాయకులు భావిస్తున్నారు. ఇందుకోసం ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధినే ఎన్నికల ప్రచార అస్త్రంగా వినియోగించనున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, కరెంట్ బిల్లుల తగ్గింపు, మెరుగైన నీటి సరఫరా, విద్య, వైద్యంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని ప్రజలకు వివరించి.. తమకు మరోసారి అధికారాన్ని ఇవ్వాలని అభ్యర్థించనున్నారు.
వీటితో పాటు ఓటర్లను ఆకర్షించేలా స్థానిక సమస్యలపై మేనిఫెస్టోలో ఎక్కువ దృష్టి పెట్టి.. ప్రజలపై ఆప్ వరాల జల్లు కరిపించే అవకాశముంది. దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా అంశాన్ని కూడా కేజ్రీవాల్ మరోమారు తెరపైకి తెచ్చారు. ఇదే అంశాన్ని మేనిఫెస్టోలో పెడతామని ప్రకటించారు.
అభివృద్ధి మంత్రం ఫలించేనా..!
నిజానికి కరెంట్ బిల్లులను తగ్గించడంలో, ప్రభుత్వ పాఠశాలల స్థితి గతులు మార్చడంలో ఆప్ ప్రభుత్వం చాలా వరకు విజయం సాధించింది. మొహల్లా హెల్త్ కేర్ క్లినిక్ సెంటర్లతో పేదలకు ఉచిత వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. రాజధానిలో భద్రతను పటిష్ఠం చేసేందుకు నిఘా కెమెరాలను పెంచింది. కానీ, దిల్లీలో ప్రమాదకరంగా మారిన కాలుష్యం మాత్రం కేజ్రీవాల్ ప్రభుత్వానికి తలనొప్పిగా మారేలా ఉంది. ఇదే సమస్యను ఎత్తిచూపి భాజపా, కాంగ్రెస్ ఆప్ సర్కారుపై విమర్శలు గుప్పించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ బృందం నమ్ముకున్న 'ఐదేళ్లలో అభివృద్ధి మంత్రం' ఫలిస్తుందో లేదో తెలియాలంటే ఫిబ్రవరి 11 వరకు వేచి చూడాలి.
కాషాయ జెండా ఎగిరేనా?
2019లో మహారాష్ట్ర, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో పరాజయాన్ని చవిచూసిన భాజపా.. కొత్త ఏడాదిని 'దిల్లీ' విజయంతో ప్రారంభించాలని చూస్తోంది. ఇందుకోసం 'మోదీ-అమిత్ షా' ద్వయంపైనే ఆశలు పెట్టుకుంది. మేనిఫెస్టోలో స్థానిక సమస్యలకే పెద్ద పీట వేసి దిల్లీ ఓటర్ల మనసులు గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. దిల్లీ కాలుష్య నివారణలో కేజ్రీవాల్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ఓటర్లను తమవైపు ఆకర్షించాలని చూస్తోంది. అలాగే జమ్మకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును కూడా ప్రచార అస్త్రంగా వినియోగించుకుని దేశ రాజధానిలో ఎలాగైనా అధికారాన్ని తిరిగి దక్కించుకోవాలని కమలనాథులు యోచిస్తున్నారు.
అయితే పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగడం భాజపా విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశముంది. జామా మసీదుతో పాటు జామియా మిలియా లాంటి విశ్వవిద్యాలయాల్లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగడం కూడా కాషాయ నేతలకు ప్రతికూలంగా మారే ప్రమాదముంది. ఈ నిరసనల ప్రభావంతో ముస్లిం ఓటర్లు భాజపాకు వ్యతిరేకంగా నిలిచేలా కనిపిస్తున్నారు. అయితే ఇదే ఏడాదిలో బిహార్, వచ్చే ఏడాదిలో బంగాల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భాజపాకు దిల్లీ పోరు కీలకం కానుంది. అందువల్ల కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని గద్దె దించి గతేడాదిలో తగిలిన వరుస దెబ్బలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. మరి దిల్లీ ప్రజలు మోదీ మేనియాకు ఫిదా అవుతారో లేదో చూడాలి.
కాంగ్రెస్ ప్రభావం చూపేనా?
ఇటీవల జరిగిన ఝార్ఖండ్, మహారాష్ట్రలో భాజపాకు ఊహించని షాకిచ్చిన కాంగ్రెస్.. దిల్లీలోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. గత ఎన్నికల ఫలితాలు పునరావృతం కాకుండా చూసి.. దేశ రాజధానిలో ఏడేళ్ల క్రితం కోల్పోయిన అధికారాన్ని తిరిగి దక్కించుకోవడానికి పక్కా ప్రణాళికలు రచిస్తోంది. అయితే 2015 ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గానూ ఒక్క చోట కూడా విజయం సాధించని కాంగ్రెస్.. ఆప్, భాజపాకు దీటుగా నిలిచి ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.
2015 ఎన్నికల ఫలితాలు
పార్టీ | సాధించిన సీట్లు (మొత్తం 70 స్థానాలు) |
ఆప్ | 67 |
భాజపా | 3 |
కాంగ్రెస్ | 0 |