దేశంలో కరోనా కోరలు చాస్తోంది. రోజురోజుకూ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించారు ప్రధాని మోదీ. ప్రజలు నిత్యవసరాలకు తప్ప బయటకు రావొద్దని అధికారులు, పోలీసులు చెబుతున్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగాల్ మంత్రి స్వపన్ దేవ్నాథ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఒంటికి కరోనా రక్షణ కవచం, మాస్క్ ధరించి, ఓ మైకుతో రోడెక్కారు. దయ చేసి ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దంటూ మైక్ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుర్ద్వాన్లోని లార్డ్ కర్జన్ గేట్ వద్ద మంత్రి ఇలా వినూత్న అవగాహన కల్పించారు.
కర్ణాటకలో..
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కర్ణాటక పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. బెల్గామ్ రహదారిపై 'కరోనా ప్రమాదం- నా నుంచి దూరంగా ఉండండి' అంటూ చిత్రాన్ని గీశారు దయానంద షేగునాసి అనే అధికారి.
తమిళనాడులో...
కరోనా వ్యాప్తిని కట్టిడి చేసేందుకు యావత్ భారతం మందుకుసాగుతోంది. కరోనా వ్యాపించకుండా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు ప్రజలు. అయితే కొన్నిచోట్ల శానిటైజర్ల కొరత తీవ్రంగా ఉంది. తమిళనాడు రామనాథపురం జిల్లా పెరైయూర్ గ్రామంలోనూ ఇదే పరిస్థితి. అందుకే గ్రామ ప్రజలు పసుపు, వేప ఆకుల మిశ్రమాన్ని గ్రామంలో పిచికారీ చేశారు. గ్రామమంతా బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని చిన్నారులు, మహిళలు, యువకులు భాగస్వాములు అయ్యారు.
ఇదీ చూడండి:ట్విట్టర్లో మోదీ త్రీడీ యోగా క్లాసులు