నిర్భయ అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషుల ఉరి శిక్ష అమలుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిహార్ జైలు అధికారులు వెల్లడించారు. అయితే.. ఉరిశిక్ష అమలును వాయిదా వేస్తూ దిల్లీ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వేచి చూస్తామని స్పష్టం చేశారు.
"మంగళవారం ఉదయం 6 గంటలకు నలుగురు నిర్భయ దోషులను ఉరితీయాల్సి ఉండగా.. అన్ని ఏర్పాట్లు చేశాం. కానీ.. ఉరి అమలు వాయిదా పడింది. కోర్టు మళ్లీ ఆదేశాలు జారీ చేసే వరకు వేచి చూస్తాం. ఉరితాళ్లను పరిశీలించాం. తలారిని పిలిపించాం. ట్రయల్స్ పూర్తి చేశాం."
- తిహార్ జైలు అధికారులు
'ఇంకా ఎన్నిరోజులు ఎదురు చూడాలి..'
నిర్భయ దోషుల మరణ శిక్ష మరోసారి వాయిదా పడటం.... దేశంలోని వ్యవస్థల వైఫల్యంగా నిర్భయ తల్లి ఆశాదేవి విమర్శించారు. నేరస్థులకే మన వ్యవస్థలు మద్దతు తెలుపుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎన్ని రోజులు న్యాయం కోసం ఎదురు చూడాలని ప్రశ్నించారు.
మూడోసారి..
నిర్భయ దోషుల ఉరి శిక్ష అమలు వాయిదా పడటం ఇది మూడోసారి. మొదటగా జనవరి 22న అమలు చేయాల్సి ఉండగా దానిని.. ఫిబ్రవరి 1కి వాయిదా వేస్తూ జనవరి 7న ఆదేశాలిచ్చింది దిల్లీ కోర్టు. ఉరి తీసేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన క్రమంలో ఒక రోజు ముందు జనవరి 31న మరోమారు స్టే విధించింది. ఆ సమయంలో తదుపరి తేదీపై ఆదేశాలివ్వలేదు. ఫిబ్రవరి 17న విచారణ చేపట్టిన దిల్లీ కోర్టు మార్చి 3న అమలు చేయాలని తీర్పు చెప్పింది. తాజాగా నేడు మరోమారు వాయిదా వేసింది.
ఇదీ చూడండి: నిర్భయ దోషుల ఉరిపై వీడని ఉత్కంఠ.. మరోమారు స్టే