మహారాష్ట్ర పుణేలో షిరూర్ తాలూకా శిక్రాపుర్కు రెండున్నర కిలోమీటర్ల దూరంలో... వాబ్లెవాడి అనే చిన్న గ్రామం ఉంది. ఈ ఊర్లో మహా అయితే 50 నుంచి 60 ఇళ్లు ఉంటాయంతే. కానీ, ఆ గ్రామం ఇప్పుడు ప్రపంచ స్థాయిలో పేరు గాంచింది. కారణం అక్కడున్న జిల్లా పరిషత్ పాఠశాలే! అవును మరి ఆ బడి దేశంలోనే తొలి జీరో ఎనర్జీ పాఠశాలగా గుర్తింపు పొంది, ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది.
ఈ బడి రూటే వేరు..
భారత్ రత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ పాఠశాల.. ఈ బడిలో విద్యార్థుల తీరే వేరు. ఎవరికి నచ్చినట్లు వారుంటారు. ఉపాధ్యాయులు వారికి సహకరిస్తారు. గంపెడు పుస్తకాలు తీసుకురారు. బడిలోకి ప్రవేశించగానే చెప్పులు విప్పి స్టాండులో పెట్టేస్తారు. 22 అడుగుల వెడల్పు.. 24 అడుగుల ఎత్తులో నిర్మించిన అద్దాల తరగతి గదుల్లో కాసేపు పాఠాలు నేర్చుకుని... పచ్చని మైదానంలో ఆటలు ఆడుకుంటారు. ఫ్రెంచ్, జర్మనీ వంటి కొత్త భాషలు నేర్చుకుంటారు. పాటలు పాడుకుంటారు. ప్రయోగాలు చేస్తూంటారు.
"మనం సాధారణంగా మనం చూసే పాఠశాలల్లో.. విద్యాబోధనంతా జ్ఞాపక శక్తికి సంబంధించి ఉంటుంది. కానీ, ఇక్కడ విద్యార్థులు అర్థం చేసుకునే సామర్థ్యం, మానసిక అంశాలకు సంబంధించి ఉంటుంది. నేను విద్యార్థులను అడిగినప్పుడు నాకు తెలిసిందేమిటంటే ఇక్కడ ప్రతి విద్యార్థి ఓ ప్రత్యేక జిజ్ఞాస కలిగి ఉన్నారు. ఈ బడి మిగతా పాఠశాలలకంటే ఎందులో భిన్నంగా ఉంది, మీకెందుకు ఈ స్కూల్ అంటే ఇష్టం అని ఓంకార్ అనే విద్యార్థిని అడిగినప్పుడు... 'నాకు నచ్చిందే ఇక్కడ నేర్పుతారు' అని బదులిచ్చాడు."
-ఆంగ్ల ఉపాధ్యాయుడు
ఏదో పాఠాలు విన్నామా.. పరీక్షల్లో బట్టీ పట్టి మార్కులు సాధించామా అన్నట్టు ఉండదు ఇక్కడి విద్యార్థుల పద్ధతి. అసలు వారికి మార్కులంటే లెక్కే లేదు. మనసుకు నచ్చింది, భవిష్యత్తుకు అవసరమైనవి మాత్రమే వారు నేర్చుకుంటారిక్కడ. ఒక్కటీ రెండూ కాదు.. జీవితానికి సరిపడా జ్ఞానాన్ని సంపాదించుకుంటారు.
"మా స్కూల్లో మేము ఎన్నో వ్యాపకాలు, కార్యక్రమాలు చేస్తుంటాం. రోబోటిక్స్, సంగీతం, కోడింగ్ వంటివి. కోడింగ్ ఎందుకు నేర్చుకుంటామంటే 21వ శతాబ్దంలో ఇదెంతో ముఖ్యం. మొత్తం కృత్రిమ మేధస్సు కోడింగ్‌పై ఆధారపడి ఉంటుంది. సీ, సీ ప్లస్ ప్లస్, జావా వంటి కంప్యూటర్ భాషలూ నేర్చుకుంటున్నాం."
- విద్యార్థి
అన్నీ వారే చేస్తారు...
ఇక్కడ క్రమశిక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. శుభ్రతను ప్రాథమిక అంశంగా భావిస్తారు.
"మా పాఠశాలలో ఎన్నో కార్యక్రమాలు చేపడుతాం. ఇక్కడ విద్యార్థులందరికి స్వీయ క్రమశిక్షణ ఉంది. అంటే, మా బడిలో పనిమనుషులెవరూ లేరు. పదినిమిషాల్లో విద్యార్థులే స్కూలు మొత్తాన్ని శుభ్రం చేసేస్తారు. మా పిల్లలతో బాత్రూమ్లు ఎందుకు కడిగిస్తున్నారని ఏ తల్లిదండ్రులు అడగరు. ఎందుకంటే మేమంతా మా ఉపాధ్యాయులను తల్లిదండ్రులుగా భావిస్తాం, స్నేహంగా మెలుగుతాం. అందుకే, మాకు టీచర్ల వద్ద భయమనేదే ఉండదు."
- విద్యార్థి
ఈ పాఠశాలకు కావాల్సిన విద్యుత్తును సోలార్ ద్వారానే తయారు చేస్తారు. ప్రకృతిని కాపాడుకునేందుకు 700కుపైగా మొక్కలు నాటారు. ఇప్పటికే కాలుష్యం వెదజల్లని ద్విచక్రవాహనాలు తయారు చేశారు. భవిష్యత్తులో కార్లు తయారు చేసి వాటిని విక్రయిస్తామంటున్నారు.
"మా స్కూల్లో ఎన్నో ప్రయోగశాలలు ఉన్నాయి. గ్రంథాలయం ఉంది. మా పుస్తకాల్లో ఉన్న ప్రయోగాలన్నీ ఇన్నోవేటివ్ సైన్స్ సెంటర్ పేరుతో ఉన్న మా ప్రయోగశాలలో ప్రత్యక్షంగా చేసి చూస్తాం. మేమంతా ఆచరణాత్మక విద్యను అభ్యసిస్తున్నాం."
- విద్యార్థి
ఆరేళ్ల క్రితం అలా..
ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ పాఠశాలలో ఆరేళ్ల క్రితం శిథిలమైన గోడలు మాత్రమే కనిపించేవి. వర్షం పడినప్పుడు ఆ గోడల నుంచి నీరు కారుతుంటే గొడుగుల కింద చదువుకునేవారు విద్యార్థులు. అది చూసి గుండె తరుక్కుపోయిన ప్రధానోపాధ్యాయుడు దత్తాత్రేయ్ వాడె.. గ్రామస్థులతో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్, బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ సహకారంతో ఈ నూతన భవనాన్ని నిర్మించారు. విద్యా వ్యవస్థలోనే పెను మార్పుకు శ్రీకారం చూట్టారు.
ఇప్పుడు ఈ సర్కారు బడి అంతర్జాతీయ పాఠశాలలతో పోటీ పడుతోంది. పలు దేశాల నుంచి ఎంతోమంది ఈ బడికి వచ్చి ఇక్కడి విద్యా విధానాన్ని తెలుసుకుంటున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పాఠశాలను ఆదర్శంగా తీసుకుని ఇలాంటి స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నాయి.