హింస, మారణాయుధాల ద్వారా సమస్యకు పరిష్కారం లభించదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. శాంతియుత చర్చల ద్వారానే ఈశాన్య భారతదేశంలోని తిరుగుబాటు సమస్యకు పరిష్కారం లభించిందని తెలిపారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. హింస ద్వార సమస్యకు పరిష్కారం కోరుకుంటున్న వారందరూ తిరిగి శాంతియుత మార్గంలోకి రావాలని కోరారు. దేశ సామర్థ్యాలపై నమ్మకం ఉంచాలని అన్నారు. 25 ఏళ్లుగా నలిగిపోతున్న బ్రూ తెగ శరణార్థుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందన్నారు.
జాతీయ క్రీడలు
ఇతర రాష్ట్రాల సంస్కృతిని పరిచయం చేసుకోవడం సహా క్రీడల్లో తమ అభిరుచిని వ్యక్త పరచడానికి నేషనల్ గేమ్స్ ఓ వేదిక అని ప్రధాని తెలిపారు. ఇక నుంచి ప్రతీ ఏటా ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో భువనేశ్వర్, కటక్లలో జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు 3 వేల మందికి పైగా క్రీడాకారులు అర్హత సాధించినట్లు వెల్లడించారు.
గడిచిన రెండు వారాల్లో సంస్కృతిని ప్రతిబింబించేలా బిహు, సంక్రాంతి, లోహ్రీ పండుగలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నట్లు గుర్తుచేశారు ప్రధాని.