దేశంలోని ప్రధాన నగరాల నుంచి మారుమూల గ్రామాల వరకు కొత్త సంవత్సర శోభ సంతరించుకుంది. బాణసంచా మోతలు, కళ్లు మిరిమిట్లుగొలిపే విద్యుత్తు దీపాల కాంతిలో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు ప్రజలు. ఉదయాన్నే సకుటుంబ సపరివారంగా ఆలయాల బాటపట్టారు. భవిష్యత్తు కాంతులమయం కావాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తుల రాకతో దేశంలోని ప్రముఖ ఆలయాలు కిటకిటలాడాయి. అసోం గువాహటిలోని కామాఖ్య ఆలయం, ముంబయిలోని శ్రీ సిద్ధివినాయక ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసిలో గంగా హారతి నిర్వహించారు.
ప్రజలకు మోదీ శుభాకాంక్షలు..
దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 2020లో ప్రతి ఒక్కరి ఆశలు, ఆశయాలు నెరవేరాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: దేశ ప్రజలకు రాష్ట్రపతి నూతన ఏడాది శుభాకాంక్షలు