కరోనా వైరస్ పోరాటంలో సహకరించడానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముందుకొచ్చారు. ప్రధానమంత్రి సహాయ నిధికి ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇచ్చినట్లు ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది. ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతికి రూ.4 లక్షల గౌరవ వేతనం లభిస్తుంది.
న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ సైతం ఒక నెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. కరోనాపై యుద్ధానికి పీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం అందజేయనున్నట్లు ట్విట్టర్లో తెలిపారు. కేబినెట్ స్థాయి మంత్రుల వేతనం దాదాపు రూ.2 లక్షలు ఉన్నట్లు తెలుస్తోంది.
రాయ్‌బరేలీ కోసం సోనియా
కరోనపై పోరాడేందుకు సొంత నియోజకవర్గమైన రాయ్‌బరేలీ ప్రజల కొరకు ఎంపీలాడ్స్ నిధులు వినియోగించనున్నట్లు సోనియా గాంధీ తెలిపారు. ఈ మేరకు నిధులు ఉపయోగించుకోవాలని రాయ్‌బరేలీ జిల్లా మేజిస్ట్రేట్‌కు లేఖ రాశారు. లాక్డౌన్ సమయంలో నియోజకవర్గంలోని ప్రజలందరికీ ఆహారం అందేలా చూడాలని మేజిస్ట్రేట్‌ను కోరారు.
కర్ణాటక నేతలు
కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కలిసి కరోనాను ఎదుర్కొనేందుకు నిధులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సభ్యులందరు ఒక్కొక్కరు రూ.1 లక్ష చొప్పున విరాళం ప్రకటించనున్నట్లు వెల్లడించారు. నిధులను నియంత్రించేందుకు మాజీ ఆరోగ్య శాఖ మంత్రి అధ్యక్షతన టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు.