ప్రపంచమంతా 2021లో అత్యంత ఆత్రుతతో వేచి చూసిన అంశం- కొవిడ్ టీకా. మునుపెన్నడూ లేని మార్పులు, అనుభవాలు, గందరగోళాలు, భయాల తరవాత ఏడాది కాలానికి ఎట్టకేలకు టీకాలు మన ముందుకు వచ్చాయి. కొవిడ్‌పై పోరులో ముందు వరస యోధులుగా పేరొందిన- ఆరోగ్య, పారిశుద్ధ్య తదితర సిబ్బందికి టీకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే, వారిలో ఉత్సాహకరమైన రీతిలో ప్రతిస్పందన కనిపించకపోవడం గమనార్హం. ఇప్పటిదాకా భారత్‌లో రెండు టీకాల పంపిణీకి ఆమోదం లభించింది. పుణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కొవిషీల్డ్, హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకాలను ఇస్తున్నారు. 2020 సంవత్సరం మహమ్మారి వ్యాధికి, సమాచార వ్యాప్తికి సంబంధించిన రెండు సవాళ్లను విసిరింది. స్వయంప్రకటిత నిపుణులు పెద్ద సంఖ్యలో ఉద్భవించారనేందుకు సామాజిక మాధ్యమాలే నిదర్శనంగా నిలిచాయి. వీరంతా టీకాలపై, వాటి సామర్థ్యంపై తప్పుడు వాస్తవాలతో కూడిన పరీక్షలు, పరిశీలన చేపట్టారు. వైద్యపరంగా తప్పుడు సమాచారంతో కూడిన వదంతుల్ని విస్తృతంగా వ్యాప్తి చేశారు.
వ్యాక్సిన్‌పై వెనకంజ
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం- టీకాలు అందుబాటులో ఉన్నా వేసుకొనేందుకు తిరస్కరించడాన్ని టీకా సంకోచంగా వ్యవహరిస్తున్నారు. భారత్‌లో గతంలోనూ టీకా సంకోచం అనేది ఆందోళనకరమైన సమస్యగానే నిలిచింది. ఉదాహరణకు- ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రజలంతా పోలియో చుక్కల మందు వేసుకుంటే, వంధ్యత్వం, అనారోగ్యం సంభవిస్తాయనే దుష్ప్రచారాన్ని విశ్వసించి భయాందోళనలకు లోనయ్యారు. నోటి చుక్కల మందు వేసుకొనేందుకు తిరస్కరించారు. ఫలితంగా పోలియో మందు వేసుకునేవారి సంఖ్య ఆకస్మికంగా తగ్గిపోయింది. ఇదే తరహా తిరస్కరణ తమిళనాడు, కర్ణాటకల్లోనూ కనిపించింది. కేరళ రాష్ట్రం మల్లప్పురం జిల్లాలో ఎంఎంఆర్ వ్యాక్సిన్లకు సంబంధించి ఇదే తరహా అనుభవం ఎదురైంది. వ్యాక్సిన్ల పట్ల భయాందోళనలతో వెనకంజ వేయడం ముందునుంచీ ఉన్నదే. ప్రస్తుత అనిశ్చితి నెలకొన్న సమయంలో, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వెల్లువెత్తడంతో ప్రజలు ఆ ప్రభావానికి లోనవుతున్నారు. టీకాలపై భయసంకోచాలు బహుళ రూపాల్లో ఉంటాయి.
యాంటీబాడీ పరీక్షలకే మొగ్గు..
వ్యాక్సిన్ల సురక్షితత్వం, సామర్థ్యాలు, దుష్ప్రభావాలపై అనుమానాలు, మతపరమైన అపోహలు వంటి సమస్యలెన్నో సంకోచాలకు కారణమవుతాయి. గత ఏడాది డిసెంబర్‌లో నిర్వహించిన 'లోకల్ సర్కిల్స్' సర్వేలో 69 శాతం తమంతట తాము టీకా కోసం తొందరపడబోమని స్పష్టంచేశారు. మరో స్వతంత్ర సర్వే ప్రకారం- 55 శాతం ఆరోగ్య రంగంలోని ఉద్యోగులు టీకా వేసుకోవడానికి వెనకాడగా, 64 శాతం టీకాకు ముందు యాంటీబాడీ పరీక్ష చేసుకొనేందుకు మొగ్గు చూపారు. ప్రస్తుతానికి టీకాను వాయిదా వేసి, తదనంతర కాలంలో వేసుకోవచ్చనేది ఈ నిర్ణయం వెనకున్న ఉద్దేశం. మొత్తానికి.. టీకాల విషయంలో ఇప్పటిదాకా ప్రతికూల ప్రభావాలు చాలా తక్కువగానే ఉన్నా, సమస్య నిశ్శబ్దంగా పెరుగుతోంది. దీనికి సంబంధించిన ధోరణులు ఎలా ఉంటాయనేది ఇప్పుడప్పుడే ఊహించడం తొందరపాటే అయినా, తప్పుడు సమాచార వ్యాప్తి కారణంగా అంతకంతకూ పెరుగుతున్న టీకా సంకోచం సమస్యను ఎత్తిచూపడం అత్యవసరం.
పరిష్కారం ఏమిటి?
టీకాలపై నెలకొన్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకుంటే, వీటిని తీవ్రంగా వ్యతిరేకించే వారికి బదులుగా, మధ్యస్థంగా ఉండేవారిని లక్ష్యంగా చేసుకోవాలి. మధ్యేమార్గంలో ఉండే ఇలాంటి వారిలో భయాందోళనలు ఉన్నా, శాస్త్రీయ వాస్తవాలు, సరైన సమాచార వివరణతో వాస్తవాల్ని అర్థం చేసుకుంటారు. సామాజిక మాధ్యమంలో ఎలాంటి సమాచారాన్ని పంచుకోవాలనుకున్నా, పునరాలోచన చేయాలి. తప్పుడు సమాచారంపై పోరాడే విషయంలో వాస్తవాల నిర్ధారణ పాత్ర బాగా పెరిగింది. అందుకని, కొవిడ్ టీకాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం మన వద్దకు వచ్చినా- దానికి సంబంధించిన నిజానిజాల్ని సరిచూసుకోవడం అందరికీ మేలుచేస్తుంది. అనుమానిత సమాచారాన్ని గుర్తించి, ఆపాలి. అలాంటి సమాచారాన్ని వాస్తవాల్ని నిర్ధరించే సంస్థలకు పంపాలి.
దీనివల్ల విశ్వసనీయ మూలాల నుంచి వచ్చే నిజమైన సమాచారం మాత్రమే ప్రసారమవుతుంది. ప్రముఖుల ప్రభావ శక్తిని ఉపయోగించుకోవాలి. టీకాలు తీసుకునే దిశగా ప్రోత్సహించే ప్రభావం చూపగల శక్తి వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఉంటుంది. ప్రముఖ వ్యక్తులు సకారాత్మక సామాజిక మార్పులకు వాహకులుగా పని చేస్తారని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. వీరు టీకాలకు సంబంధించిన భయాందోళనల్ని తొలగించే అవకాశం ఉంటుంది. క్షేత్రస్థాయిలో, సామాజిక మాధ్యమాల్లో ప్రజా టీకా కార్యక్రమానికి ఆకర్షణతోపాటు, విశ్వసనీయతనూ జోడిస్తారు. కొవిడ్ వ్యాక్సిన్లపై తప్పుడు అనుమానాల్ని, అపోహల్ని, నకిలీ వార్తలను తిప్పికొట్టడం ద్వారా తప్పుడు సమాచార వ్యాప్తిపై పోరాటం సాగించాలి.
- రాకేష్ దుబ్బుడు, రచయిత- 'ఫ్యాక్ట్ చెక్' నిపుణులు
ఇదీ చదవండి: భారత్‌లో 41 లక్షల మందికిపైగా వ్యాక్సినేషన్