అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రెండు రోజుల పాటు భారత పర్యటన కోసం బయల్దేరారు. వాషింగ్టన్లోని జాయింట్ బేస్ ఆండ్రూస్ సైనిక స్థావరం నుంచి ఎయిర్ఫోర్స్ వన్లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అంతకుముందు శ్వేతసౌధంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్... చాలా రోజుల క్రితమే భారత్కు రావడానికి నిశ్చయించుకున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ తన స్నేహితుడని మరోసారి ఉద్ఘాటించారు. భారత పర్యటన కోసం ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు.
"భారత ప్రజలను కలిసేందుకు ఎదిరిచూస్తున్నా. అక్కడ లక్షల మంది మాకోసం ఉన్నారు. ఇది సుదీర్ఘ పర్యటన. నేను ప్రధాని మోదీతో బాగా కలిసిపోతాను. అతను(మోదీ) నా స్నేహితుడు. చాలా రోజుల క్రితమే భారత పర్యటనకు రావాలనుకున్నాను. ఇది చాలా పెద్ద కార్యక్రమం అవుతుంది. భారత్లో ఇప్పటివరకు ఇలాంటి పెద్ద కార్యక్రమం జరగలేదని ప్రధాని నాతో చెప్పారు."-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, అధ్యక్షుడి కుమార్తె ఇవాంక ట్రంప్, అల్లుడు జారెడ్ కుష్నర్ సైతం భారత పర్యటన కోసం బయలుదేరారు. రేపు ఉదయం 11:30 గంటలకు అహ్మదాబాద్ చేరుకోనున్నారు.