నీట్, జేఈఈ పరీక్షల వాయిదా విషయంలో జోక్యం చేసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేకు లేఖ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు ఓ లా విద్యార్థి, 12వ తరగతి చదువుతున్న మరో విద్యార్థి. దేశంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో కేంద్రం పరీక్షలు నిర్వహిస్తామనడంపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణాల కంటే పరీక్షలు ఎక్కువేం కాదని లేఖలో పేర్కొన్నారు. ఈ సమయంలో పరీక్షలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లేనని తెలిపారు.
" మానవాళికి కరోనా మహమ్మారి అత్యంత ప్రమాదకరంగా పరిణమించింది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది చనిపోతున్నారు, కోట్ల మంది వైరస్ బారిన పడుతున్నారు. కోలుకున్న వారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం కోర్టులు, పార్లమెంటు, అసెంబ్లీలు, విద్యాసంస్థలు మూసివేశారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం సిబ్బందితోనే విధులు నిర్వహిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇది ఆహ్వానించదగిన విషయమే. అయితే వీఐపీల ప్రాణాలకు ఉన్న విలువ 17-18 ఏళ్ల విద్యార్థుల ప్రాణాలకు లేకపోవడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. కరోనా తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో కచ్చితంగా పరీక్షలు జరుపుతామంటున్నారు. పరీక్షలకు హాజరయ్యేందుకు ఎంతో మంది విద్యార్థులు సుదూర ప్రాంతాలకు ప్రయాణించాలి. ప్రభుత్వ రవాణా వల్ల వైరస్ బారినపడే ప్రమాదం ఉంది. పేద విద్యార్థుల్లో కొందరికి మాస్కులు, శానిటైజర్లు కొనుగోలు చేసే స్తోమత కూడా లేదు. భవిష్యత్తులో డాక్టర్లు, ఇంజినీర్లు కావాల్సిన యువత ప్రాణాలకు ముప్పు తలపెట్టాలనుకోవడం సరికాదు. ప్రాథమిక హక్కులకు భంగం కల్గినప్పుడు ఉగ్రవాదులు, నేరస్థులనే కాపాడుతున్నారు. విద్యార్థుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు సీజేఐపై ఉంది."
-లేఖలో విద్యార్థులు.
ఇదీ చూడండి:'జాతీయ క్రీడా పురస్కారాల ప్రైజ్ మనీ భారీగా పెంపు'