లాక్డౌన్ వేళ రైతులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. చట్టంలో మార్పులు చేసి నేరుగా రైతుల వద్దకు వెళ్లి వ్యవసాయ ఉత్పత్తులను కొనేలా ఏర్పాట్లు చేయాలని కేంద్రానికి సూచించారు.
ఈ మేరకు కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ థోమర్తో సమావేశమయ్యారు వెంకయ్యనాయుడు. లాక్డౌన్ సమయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.
"వ్యవసాయ ఉత్పత్తులను రైతుల వద్దకే నేరుగా వెళ్లి కొనే ఏర్పాట్లు చేయాలి. ఇందుకోసం వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ చట్టంలో మార్పులు చేయాలి. ఈ చర్యల వల్ల మండీలకు వెళ్లాల్సిన అవసరం తప్పుతుంది. రైతులు, వినియోగదారుల ప్రయోజనాలు కాపాడాలి."
-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
అంతేకాకుండా.. వ్యవసాయ పనుల్లో కానీ.. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాలో ఎలాంటి అడ్డంకులు ఉండకుండా చొరవ తీసుకోవాలని సూచించారు వెంకయ్య. పండ్లు, కూరగాయల నిల్వ, రవాణా, మార్కెటింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.
ఇదీ చూడండి: 'లాక్డౌన్ మార్గదర్శకాలు కఠినంగా అమలు చేయండి'