గగన్‌యాన్ యాత్ర కోసం భారత వ్యోమగాముల శిక్షణ చిన్న విరామం తర్వాత మళ్లీ మొదలైంది.
తొలిసారిగా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గగన్‌యాన్’ ప్రాజెక్టుపై కొద్దిరోజుల క్రితం కరోనా మహమ్మారి ప్రభావం పడింది. దీంతో యాత్ర కోసం రష్యా గగారిన్ పరిశోధనా కేంద్రంలో శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల శిక్షణ మే 12న ఆగిపోయింది. ఎట్టకేలకు వైద్య పరీక్షల అనంతరం ఇప్పుడు తిరిగి ప్రారంభమైంది.
కరోనా సోకకుండా మాస్కులు, శానిటైజర్లు, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు పాటిస్తూ.. ఈ వారంలో ఖగోళయానంపై థియరీ క్లాసులు చెబుతారు నిపుణులు. భారత వ్యోమగాములకు రష్యన్ భాష, రాకెట్ నియంత్రణ నేర్పుతారు. దారి తప్పినా, అసాధారణ ల్యాండింగ్ చేయాల్సి వచ్చినా ఎలా మసులుకోవాలో వివరిస్తారు. మొత్తం మీద భారత వ్యోమగాములను అంతరిక్షంలో కొద్ది రోజులపాటు గడిపేందుకు సిద్ధం చేస్తారు.
ఇదీ చదవండి:'గగన్‌యాన్' కోసం భారత వైద్యులకు ఫ్రాన్స్ శిక్షణ