కరోనా మహమ్మారి కారణంగా మన జీవన విధానంలో పెనుమార్పులు సంభవించాయి. లాక్డౌన్ వల్ల ఎన్నో బాధలు అనుభవించారు ప్రజలు. చివరకు పాఠశాలలకు వెళ్లి ఉల్లాసంగా గడిపే విద్యార్థులు కూడా ఇళ్లకే పరిమితమయ్యారు. ఆన్లైన్ తరగతుల ద్వారా వారికి ఇళ్లలోనే బోధిస్తున్నారు. బయటకు వెళ్లే పరిస్థితి లేక ఎంతో మంది మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఈ పరిస్థితులను అవకాశంగా మలుచుకుంటున్నారు. తమలోని కళకు పదునుపెడుతున్నారు. కేరళ మలప్పురం జిల్లా కుట్టిప్పురంలోని అఖిల కూడా ఆ కోవలోకే వస్తుంది. తన కళానైపుణ్యాన్ని ప్రదర్శించి.. ఆకులతోనే అద్భుతాలు సృష్టిస్తోంది.
మలప్పురంలోని మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ సైకాలజీ ఫైనల్ ఇయర్ చదువుతోంది అఖిల. లాక్డౌన్లో దొరికిన ఖాళీ సమయంలో ఆకులతో కళాకృతులు చేయడంపై దృష్టి సారించింది. కొద్ది రోజుల్లోనే ఆ కళలో ఆరితేరింది. మర్రి, రావి, టేకు, పనస చెట్ల ఆకులతో అద్భుత కళాఖండాలు చెక్కింది. ప్రముఖుల చిత్రాలను ఆకులపైనే గీసింది. అఖిల కళా నైపుణ్యానికి ఇన్‌స్టాలో అనేక మంది దాసోహమయ్యారు. ఆమె పేజీని అనుసరించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.
జాతిపిత మహాత్మా గాంధీ, నటుడు మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, గాయని చిత్ర వంటి ప్రముఖుల చిత్రాలను ఆకులపైనే గీసి అబ్బుర పరిచింది అఖిల. వీటిని ఆమె కళాశాలలో నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవంలో ప్రదర్శించగా.. ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు చూసి మంత్ర ముగ్దులయ్యారు. ఆమెలో దాగి ఉన్న ప్రతిభను కొనియాడారు.
లీఫ్ ఆర్ట్‌తో పాటు శాస్త్రీయ సంగీతం, పెన్సిల్‌తో కళాకృతులు చేయడం, ఇతర కళల్లోనూ అఖిలకు మంచి నైపుణ్యం ఉంది.