ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన వారు ఇప్పుడు తమ గురించి అసత్యాలు వ్యాపింపజేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. విపక్షాలు ఎన్ని అబద్ధాలు చెప్పినా.. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా భాజపాపై ప్రజలకున్న నమ్మకం చెక్కుచెదరలేదని ఉద్ఘాటించారు.
భాజపా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జేపీ నడ్డాను సన్మానించేందుకు దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు మోదీ.
"మా ఆదర్శవంతమైన పనులతో కొందరికి ఇబ్బందిగా ఉంది. వారి బాధ మేము మంచి పనులు చేస్తున్నామని కాదు. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారనే వారి బాధ. ఎన్నికల రాజకీయాల్లో ఎవరినైతే ప్రజలు తిరస్కరించారో.. ఎవరినైతే ప్రజలు అంగీకరించడానికి సిద్ధంగా లేరో.. ఇప్పుడు వారి వద్ద చాలా తక్కువ అస్త్రాలున్నాయి. వాటిల్లో కొన్ని భాజపాపై అసత్యాలు వ్యాపింపజేయడం, అనిశ్చితిని నెలకొల్పడం. ప్రతి దానికీ రంగులు పూయడం. ఇవన్నీ నిత్యం చూస్తూనే ఉన్నాం."
-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.
విపక్షాలు తమ శక్తి సామర్థ్యాలకు మించి కృషి చేసినా ప్రజలు తమకే పట్టంగట్టారని పేర్కొన్నారు మోదీ. అధికారంలో ఉంటూనే భాజపా.. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎదగడం ఎంతో పెద్ద విషయమన్నారు. ఇందుకు పార్టీ చేపట్టిన సంస్థాగత కార్యకలాపాలే కారణమని స్పష్టం చేశారు. కానీ తమ సిద్ధంతాలు కొందరికి నచ్చడంలేదని విపక్షాలపై విమర్శించారు.
నడ్డాతో బంధం...
భాజపా నూతన అధ్యక్షుడు జగత్ ప్రకాశ్ నడ్డాపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. నడ్డా ఎంతో అంకితభావం గల వ్యక్తని కితాబిచ్చారు. సిద్ధాంతాలకు కట్టుబడి నడ్డా నేతృత్వంలో పార్టీ ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భాజపా నూతన అధ్యక్షుడితో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు మోదీ.
భాజపా అధ్యక్షుడిగా అమిత్ షా అందించిన సేవలనూ ప్రధాని కొనియాడారు. షాను ఓ ఆసాధారణ కార్యకర్తగా అభివర్ణించారు.