ఛత్తీస్‌గఢ్ దంతేవాడ నుంచి 30కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి డోల్‌కాల్ పర్వతాలు. డోలు ఆకృతిలో ఉండడం వల్ల వాటికా పేరు వచ్చింది. అక్కడ 2,500 అడుగుల ఎత్తులో కొలువై ఉంది ఓ అరుదైన గణేశ విగ్రహం. ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో విరిగిన దంతం. కిందిభాగం కుడిచేతిలో రుద్రాక్ష మాల, మరో చేతిలో మోదకాలతో దర్శనమిస్తాడు డోల్‌కాల్ గణేశుడు.
ఆయుధధారుడై ఉండడం దోల్‌కాల్ గణేశుడి ప్రత్యేకత. అక్కడ గణపయ్య లలితాసనంలో కనిపిస్తారు. బస్తర్‌లో తప్ప మరెక్కడా ఆయన ఆ భంగిమలో ఉండరు. బస్తర్ ప్రత్యేక నిపుణులు హేమంత్ కశ్యప్ ప్రకారం.. ఈ డోల్‌కాల్ శిఖరంపైనే వినాయకుడు-పరుశరామ్ మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలోనే గణేశుడి దంతం విరిగింది. అప్పటి నుంచే ఆయనను ఏకదంతుడిగా పిలుస్తున్నారు. ఆ ఘటనకు గుర్తుగా చిండక్ నాగవంశానికి చెందిన రాజు గణేశ్ మూర్తిని అక్కడ ప్రతిష్ఠించారట.
పరుశరాముడి గొడ్డలి వల్లనే ఆ యుద్ధంలో గణేశుడి దంతం తెగిపడింది. అందుకే ఆ కొండ కింద గ్రామానికి పరాస్పల్ అనే పేరు వచ్చింది.
"ఒకసారి నందిరాజ్ పర్వతంపై ఉన్న శివుడిని కలిసేందుకు పరుశరాముడు వచ్చాడు. ఆ సమయంలో గణేశుడు ద్వారపాలకుడిగా ఉన్నారు. పరుశరాముడు శివుడిని కలిసేందుకు వచ్చినట్లు చెప్పగా, ఆయన తపస్సులో ఉన్నారు ఎవరు కలవడానికి వీల్లేదని చెప్పారట. ఆ విషయంపై మాటమాట పెరిగి యుద్ధం వరకు వెళ్లింది."
-హేమంత్ కశ్యప్, బస్తర్ నిపుణుడు
మూలాలు అక్కడే
దక్షిణ బస్తర్‌లోని 'భోగా' ఆదివాసి తెగ తమ మూలాలు డోల్‌కాల్‌లోని డోల్‌కాల్ కట్ట మహిళా పూజారి వద్ద నుంచి మొదలైనట్లు చెబుతారు. మొదటగా 'భోగా' ఆదివాసి తెగకు చెందిన ఒక మహిళ శిఖరం పైకి చేరుకుని పూజలు ప్రారంభించింది. ప్రతి ఉదయం ఆమె శంఖారావంతో డోల్‌కాల్ శిఖర పరిసరాలు మేల్కొనేవట. ఈ రోజుకీ ఆ మహిళ వారసులు అక్కడ గణేశుడికి పూజలు నిర్వహిస్తారు.
"ఒక మహిళ అక్కడ పూజలు చేసి పూజ అనంతరం శంఖాన్ని పూరించేవారు. ఆ శబ్దానికి గ్రామం మొత్తం మేల్కొనేవారు."
-హేమంత్ కశ్యప్, బస్తర్ నిపుణుడు
గొడ్డలి సాక్ష్యం
బస్తర్‌కు చెందిన మరో నిపుణుడు సంజీవ్ పచోరీ.. దంతేవాడ ప్రాంత రక్షకుడిగా 11వ శతాబ్దంలో కొండశిఖరంపై చిండక్ నాగవంశీయులు ఆ దేవుడి విగ్రహం ప్రతిష్ఠిచారని చెబుతారు. గణేశుడి ఆయుధంగా ఉన్న గొడ్డలే అందుకు సాక్ష్యం. ఆ కారణంగానే నాగవంశ రాజులు అంత ఎత్తైన శిఖరంపై వినాయక విగ్రహం పెట్టారట. వారిగుర్తుగా ఆ విగ్రహాన్ని చెక్కేసమయంలో దానిపై నాగముద్ర కూడా చెక్కించారు. దానికి పరిహారంగా మరోవైపు శిల్పకారులు జపమాల కూడా ఏర్పాటు చేశారు.
"చేతిలో విరిగిన దంతం, ఉదరంపై నాగముద్ర, మరోవైపు యజ్ఞోపవీతమున్న అరుదైన విగ్రహం డోల్‌కల్ గణేశుడు. ప్రపంచంలోనే ఇలా ఉన్నఏకైక, పురాతన విగ్రహం ఇది."
-సంజీవ్ పచోరీ
శిలలతో అద్భుతంగా
ఇంద్రావతి నదీతీరంలో లభించే శిలలతోనే ఆ విగ్రహం మలిచారు. పర్వత శిఖరాగ్రంలో 2 చదరపు మీటర్ల వైశాల్యంలో దానిని ఏర్పాటు చేశారు. బైలాడిలా పర్వతశ్రేణుల్లో అదే ఎత్తైన శిఖరం. ఆ క్లిష్టమైన నిర్మాణం, చెక్కిన తీరు 11వ శతాబ్దంలోని అద్భుత కళాకృతులకు సాక్ష్యం. ఈ కొండ కిందనున్న పరస్పాల్ గ్రామంలో ఏటా ఉత్సవాలు చేస్తారు.
"ఏటా వేసవిలో మూడు రోజుల పాటు పరస్పాల్ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ సందర్భంగా డోల్‌కాల్ గణేశ్, పరుశరాముడు, స్థానిక దేవతలకు పూజలు చేస్తారు."
-హేమంత్ కశ్యప్, బస్తర్ నిపుణుడు
దృష్టిసారిస్తే పర్యటక ప్రాంతంగా..
డోల్‌కాల్ శిఖరంపై ఉన్న విగ్రహానికి ఎలాంటి గోపుర నిర్మాణం చేయకపోవటం మరో ప్రత్యేకత. కొండపై సహజసిద్ధంగా ఏర్పడినట్లు ఉండే ఈ విగ్రహాన్ని చూడాలంటే రెండున్నర గంటలకు పైగానే శ్రమించాల్సి ఉంటుంది. సరైన దారంటూ లేని దట్టమైన అడవి మధ్యలో నుంచి కొండలు గుట్టలు దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఆ కారణంగానే భక్తులు చాలా అరుదుగా అక్కడికి వస్తుంటారు. స్థానికులే పూజలు నిర్వహిస్తుంటారు.
ఈ ప్రాంతం అభివృద్ధిపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్రప్రభుత్వం, పర్యటక శాఖ దృష్టి సారించాల్సి ఉంది. దానివల్ల మిగిలిన రాష్ట్రాల నుంచే కాక దేశ విదేశాల నుంచి పర్యటకులు వచ్చి ఈ అరుదైన గణేశుడి విగ్రహాన్ని దర్శించుకునే వీలు ఉంటుంది.