శరీర ఉష్ణోగ్రతల ఆధారంగా కరోనా బాధితులను గుర్తించడానికి దేశంలోని విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ చేపట్టినా అది తగిన ఫలితాన్ని ఇవ్వడం లేదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) ఫిబ్రవరిలోనే హెచ్చరించింది. ఈ సంస్థ జర్నల్‌లో వెలువరించిన కథనం ఈ విషయాన్ని వెల్లడించింది. వైరస్ సోకిన వారిలో సుమారు 46% మంది ప్రయాణికులను థర్మల్ స్క్రీనింగ్ కనిపెట్టలేకపోయి ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.
రోగ లక్షణాలు లేవన్న కారణంతో చాలామంది ప్రయాణికులు తప్పించుకొని ఉంటారని తెలిపింది. జనవరి 15న విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ ప్రారంభించక ముందు 5,700 మంది ప్రయాణికులు కరోనా ప్రభావిత చైనా, తదితర దేశాల నుంచి వచ్చారు. అందులో 17 మంది (0.3%)లో లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రుల్లో చేరినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.
26% మందికి కొవిడ్ సోకే ప్రమాదం
'డైమండ్ ప్రిన్సెస్’ విహార నౌక తరహాలో బాధితులు, ఇతరులు దగ్గర దగ్గరగా ఉంటే మన దేశంలో 26% మందికి కరోనా సోకే అవకాశం ఉండొచ్చని, ప్రతి 450 మందిలో ఒకరు చనిపోవచ్చని ఐసీఎంఆర్ ఈ పరిశోధన పత్రంలో అంచనా వేసింది. ఇది లాక్‌డౌన్‌కి ముందున్న పరిస్థితుల ఆధారంగా వేసిన లెక్క.