ప్రజా జీవితంలో వ్యక్తులు, సంస్థల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఒకరి ఆలోచలను మరొకరు గౌరవించాలని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. కేరళకు చెందిన ఓ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు మోదీ. అభిప్రాయ భేదాలు ఎన్ని ఉన్నా.. చర్చలకు ఆస్కారం ఉండాలన్నారు.
ఇతరుల ఆలోచనలు తమ ఆలోచనా ధోరణికి దగ్గరగా ఉన్న వారితో మమేకమయ్యేందుకు అందరూ ఇష్టపడతారని, అది వారికి సౌకర్యంగా అనిపిస్తుందని అన్నారు మోదీ. అయితే ప్రతిఒక్కరూ అలా వ్యవహరించకుండా అందరితో కలసి ఉండాలన్నారు.
ఇంటి పేరు, ప్రతిష్ఠల ఆధారంగా విజయం సాధించలేరని పేర్కొన్నారు మోదీ. వ్యక్తిగత సామర్థ్యం, సాధించాలనే సంకల్పంతోనే అన్నీ సాధ్యమవుతాయన్నారు.
గతంలో లైసెన్స్ రాజ్, పర్మిట్ రాజ్‌ల కారణంగా ప్రజల ఆకాంక్షలకు అడ్డంకులు ఏర్పడ్డాయన్నారు మోదీ. ప్రస్తుత నవ భారతంలో ఆ పరిస్థితిని పూర్తిగా మార్చివేశామని చెప్పారు.
ఇదీ చూడండి: ఆరోగ్య భారత్‌కు 12,500 ఆయుష్ కేంద్రాలు: మోదీ