వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం పూర్తిగా రెండు భిన్న కోణాల్లో అటు ఈశాన్య రాష్ట్రాల్ని, ఇటు తక్కిన దేశాన్నీ తీవ్రాందోళనకు గురిచేస్తోంది. అక్రమ వలసదారుల ఏరివేత లక్ష్యాన్ని కొరగాకుండా చేసి, నయా వలసలకు కొత్త చట్టం లాకులెత్తుతుందని ఈశాన్యం మొత్తుకొంటుంటే, అవసరమైతే సవరణలకు సిద్ధమని కేంద్రం భరోసా ఇస్తోంది. మరోవంక మతపర దుర్విచక్షణకు గురై పొరుగున మూడు దేశాలనుంచి వచ్చే వలసదారుల్లో ముస్లిములకు తప్ప తక్కినవారికి పౌరసత్వం ఇస్తామన్న ప్రభుత్వం, పౌర పట్టిక క్రతువును జాతీయ స్థాయిలో అమలు చేస్తామనడంతో- రాజ్యాంగబద్ధంగాని పెడధోరణి అందులోనూ ప్రతిఫలించి దేశవాసులుగా తమ అస్తిత్వమే ప్రశ్నార్థకమవుతుందన్న భయాందోళనలు ముస్లిముల్లో ముప్పిరిగొన్నాయి.
సానుకూల వైఖరి మారిన రాజకీయం
పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టులో కేసులు దాఖలు కాగా, పౌరపట్టిక క్రతువు తమకు సమ్మతం కాదంటూ తాజాగా బిహార్ సహా పలు రాష్ట్రాలు తీర్మానాలూ ఆమోదించాయి. కేంద్రం శాసనాన్ని రాష్ట్రాలు శిరసావహించాల్సిందేనని ఎన్‌డీఏ ప్రభుత్వం స్పష్టీకరిస్తుంటే, రాజ్యాంగంలోని 131 అధికరణ కింద న్యాయ పోరాటానికి రాష్ట్రాలు కదులుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జామియా విశ్వవిద్యాలయం లాంటిచోట్ల నిరసనలపై పోలీసులు ఉక్కుపాదం మోపడం, చట్టాన్ని వ్యతిరేకిస్తున్నవారిపై దేశద్రోహ కేసుల్ని బనాయించడం వంటి అప్రజాస్వామిక ధోరణులు పెరిగిపోతున్నాయి. షహీన్ బాగ్ నిరసనకారులతో సంప్రతింపులకు న్యాయపాలికే చొరవచూపి నివేదిక రాబట్టింది. అలాంటి సానుకూల వైఖరి లోపించిన రాజకీయ వాతావరణం- ప్రతి పౌరుడికీ గల నిరసన హక్కును కర్కశంగా తొక్కిపట్టే ప్రమాదకర పరిస్థితులకు పాదుచేస్తోంది. అది మత విద్వేషాల రంగూ పులుముకొని మరణమృదంగం మోగిస్తోంది!
నిరసన ప్రాధాన్యానికి అద్దం పట్టిన ధర్మాసనం
'అన్ని మతాలను గౌరవించాలని హిందుత్వం నాకు ప్రబోధించింది... రామరాజ్య రహస్యం అందులో నిబిడీకృతమై ఉంది' అని ఉద్బోధించారు మహాత్మాగాంధీ. ఆ స్ఫూర్తికి గొడుగుపట్టిన భారత రాజ్యాంగం- పౌరస్వేచ్ఛ స్వాతంత్య్రాలకు ఎత్తుపీట వేసింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకించేవారిపై దేశద్రోహులు, జాతి వ్యతిరేకులన్న ముద్ర వెయ్యరాదని స్పష్టీకరించిన బాంబే హైకోర్టు- నిరసనలపై నిషేధాన్ని పది రోజుల క్రితం అడ్డంగా కొట్టేసింది. నిరసన తెలిపేవారందర్నీ టోకున జాతి వ్యతిరేకులుగా తూలనాడటం రాజ్యాంగ విలువలకు శరాఘాతమవుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇటీవలే ఘంటాపథంగా చాటారు. ఏదైనా పార్టీకి 51 శాతం ఓట్లు వచ్చాయంటే దాని అర్థం- మెజారిటీతో అది ఏం చేసినా తక్కిన 49శాతం మంది కిక్కురుమనకుండా ఆమోదించాలన్నది కాదన్న జస్టిస్ దీపక్‌గుప్తా- ప్రజాస్వామ్యంలో నిరసన ప్రాధాన్యానికి అద్దంపట్టారు.
సంఖ్యాధిక్యం (మెజారిటీ) ప్రజాస్వామ్యంలో అంతర్భాగమైనా, బలాధిక్యవాదం డెమోక్రసీని కాలరాస్తుందన్న మాటలో వీసమెత్తు అతిశయోక్తి లేదు. మరోమాటలో- శాంతియుత నిరసనలకు మన్నన దక్కినచోటే చట్టబద్ధ పాలన సాగుతున్నట్లు! చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు తమకుతామే చట్టంగా మారి ఇటీవల జామియా ఇస్లామియా యూనివర్సిటీ గ్రంథాలయంలో మాదిరిగా హింసనచణ సాగించినా, తాజాగా ఈశాన్య దిల్లీలో ధ్వంసరచనను చేష్టలు దక్కి చోద్యంచూసినా- పౌరుల మౌలిక హక్కులే మంటగలిసిపోతాయి. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామంటూ పదవీ ప్రమాణాలు చేసి అధికారం చేపట్టే పార్టీలు ఆ స్ఫూర్తిని కాలరాస్తే- దేశం ఎటుపోతున్నట్లు?