లాక్‌డౌన్ నిబంధనలను నీరుగార్చినట్లు కేంద్రం చేసిన వ్యాఖ్యలను కేరళ ప్రభుత్వం తోసిపుచ్చింది. కేంద్ర ప్రభుత్వం సూచనలకు అనుగుణంగానే కొన్ని మినహాయింపులు ఇచ్చినట్లు పినరయి విజయన్ సర్కారు తెలిపింది. ఈనెల 17న తమ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను... కేంద్ర ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకుందని వ్యాఖ్యానించింది.
కేంద్రం నుంచి లేఖ రాగానే.. తమ మార్గదర్శకాలపై చర్చించేందుకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్. ఈ భేటీ అనంతరం పలు సడలింపులపై పూర్తి స్పష్టత రానుంది.
అభ్యంతరం వ్యక్తం..
రెస్టారెంట్లు, క్షౌరశాలలు, మున్సిపాలిటీలలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కార్యకలాపాలకు ఇవాళ్టి నుంచి అనుమతులు ఇచ్చింది కేరళ ప్రభుత్వం. పరిమిత సంఖ్యలో బస్సులు నడపడమే కాకుండా.. ప్రజలు బయట తిరిగేందుకూ కొన్ని ఆంక్షలు సడలించింది. అయితే ఈ విషయంపై స్పందించిన కేంద్ర హోంశాఖ.. కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఇష్టారాజ్యం పనిచేయదు..!
లాక్‌డౌన్ నిబంధనలు పకడ్బందీగా అమలయ్యేలా చూడాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది కేంద్ర హోంశాఖ. ఈ నెల 15న జారీ చేసిన మార్గదర్శకాలను తప్పక పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. లాక్‌డౌన్ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారం అనుమతులు ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది.
దేశమంతా విపత్తు నిర్వహణ సంస్థ ఆదేశాలు పాటించాలని ఆదేశించిన హోంశాఖ.. రాష్ట్రాలు అనుసరించాల్సిన వైఖరిపై గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తుచేసింది. ఎవరికి వారి నిర్ణయాల వల్ల దేశమంతా నష్టపోయే పరిస్థితి రాకూడదని హెచ్చరించింది.
ఇదీ చూడండి: 'కరోనా ఫ్రీ'గా మణిపుర్.. ఈశాన్య రాష్ట్రాల్లో స్వల్పంగానే