మూడు నెలలక్రితం వుహాన్(చైనా) నగరంలో వెలుగుచూసిన కరోనా వైరస్ చాపకింద నీరులా 170కిపైగా దేశాలకు వ్యాపించి ఇప్పుడు ప్రపంచాన్నే వణికిస్తోంది. విశ్వవ్యాప్తంగా రెండు లక్షల 30వేలకు పైబడిన కేసుల సంఖ్య, రమారమి తొమ్మిది వేల మరణాలు, సత్వరం కట్టడి చేయని పక్షంలో అగ్రరాజ్యం అమెరికాలోనే 22లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోతారన్న అంచనాలు... సంక్షోభ తీవ్రతను కళ్లకు కడుతున్నాయి. ‘మహమ్మారి’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన వైరస్ ధాటికి ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, దక్షిణకొరియా వంటివీ భీతిల్లుతున్నాయి. దేశదేశాల్లో తొలి లక్ష కేసుల నమోదుకు 45రోజులు పట్టగా, తరవాతి తొమ్మిది రోజుల్లోనే మరో లక్ష కేసులు పెరిగాయి. మానవాళి నేడు ప్రపంచ యుద్ధం కన్నా పెద్ద విపత్తును ఎదుర్కొంటున్నదన్న ప్రధాని మోదీ రేపు ఆదివారంనాడు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాల్సిందిగా జాతిజనులకు తాజాగా పిలుపిచ్చారు. ఆయన ప్రస్తావించిన ‘సామాజిక దూరీకరణ’ బాణీలోనే- కొన్నాళ్లపాటు మంది గుమిగూడకుండా ఉండటమే ఈ సమస్యను అధిగమించడానికి అత్యుత్తమ పరిష్కారమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచిస్తున్నారు.
వ్యక్తిగత పరిశుభ్రతే విజయం..
భారత్ కన్నా మెరుగైన ఆరోగ్య వ్యవస్థలు కలిగిన దేశాలూ, చురుగ్గా స్పందించడంలో కనబరచిన అలసత్వానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. రోజూ వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడుతున్న ఇటలీ దుస్థితికి- అత్యవసర ఏర్పాట్లు చేయడంలో యంత్రాంగం నిర్లక్ష్యం, ఆంక్షల్ని గాలికొదిలేసిన పౌరుల ఉదాసీనత... పోటాపోటీగా పుణ్యం కట్టుకున్నాయి. ఆ తరహా ఉత్పాతం, విషాదం దేశీయంగా పునరావృతం కాకుండా గౌరవ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు సమర్థంగా కాచుకోవాలి. భారతదేశ జనాభాలో 66శాతందాకా గ్రామీణులే. వ్యక్తిగత పరిశుభ్రత పాటించి, నిపుణులు సూచిస్తున్న విధి నిషేధాలకు కట్టుబాటు చాటే పౌర స్పృహే కర్కశ వైరస్‌పై విజయానికి తొలి మెట్టు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలకు దీటుగా ప్రజలూ క్రియాశీల పాత్ర పోషించాలి. గ్రామాలకు కరోనా వైరస్ సోకకుండా వారు అన్ని జాగ్రత్తలూ తీసుకోగలిగితే, మూడింట రెండొంతుల భారతీయులు ఈ గండం గడిచి గట్టెక్కినట్లే!
మూతపడుతున్న మాల్స్..
దగ్గు, తుమ్ముల ద్వారా ఒకరినుంచి మరొకరికి సంక్రమించే కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో భాగంగా తరతమ భేదాలతో వివిధ దేశాల్లో ప్రార్థనా మందిరాలు, థియేటర్లు, మ్యూజియాలు, వ్యాయామశాలల వంటివి మూతపడుతున్నాయి. న్యూజెర్సీ, శాన్‌ఫ్రాన్సిస్కో (అమెరికా) నగరాల్లో కర్ఫ్యూ విధించగా- ఫ్రాన్స్, స్పెయిన్ వంటి చోట్లా కఠిన ఆంక్షలు అమలుపరుస్తున్నారు. రష్యా తమ గడ్డపైకి విదేశీయుల రాకను నిషేధించింది. ప్రస్తుతం కేసుల ఉద్ధృతి ఉపశమించిన చైనా తనవంతుగా ‘ప్రజాయుద్ధం’ పేరిట అమలుపరచిన వ్యూహం ఎవరికైనా శిరోధార్యం. యాభైకోట్లమందికి పైగా తలదాచుకునే జనావాసాల్లోకి వెలుపలినుంచి ఎవ్వరూ అడుగుపెట్టకుండా చైనా ప్రభుత్వం లక్షల సంఖ్యలో పర్యవేక్షకుల్ని నియోగించింది. ఆ ప్రయోగాన్ని ఇక్కడ ప్రతి గ్రామం స్వచ్ఛందంగా అమలు జరపగలిగితే, కరోనాపై పోరులో అదో గొప్ప మేలుమలుపవుతుంది.
నిషేధాజ్ఞలు పాటించడం మేలు..
దేశంలో నమోదైన కేసులలో అత్యధికం, తెలంగాణలోని 14 కేసులూ- విదేశీ భూభాగంపై వైరస్ సోకినవి, బయటినుంచి ఇక్కడికి వచ్చిన అన్య జాతీయులవి. పరిస్థితి కుదుటపడేవరకు వెలుపలినుంచి ఎవరూ ఊళ్లోకి రాకుండా ప్రతి గ్రామంలోనూ నిషేధాజ్ఞలు పాటించడం మంచిది. ఆ మేరకు పార్టీగత రాజకీయాల్ని పక్కనపెట్టి కరోనాను దరిదాపుల్లోకి రానివ్వకుండా గ్రామ పెద్దలు ఒక్కమాటపై కదలాలి. అనివార్యంగా ఎవరినైనా అనుమతించాల్సి వచ్చినా కనీసం రెండువారాలపాటు ఏకాంతవాసం (క్వారంటైన్) తప్పనిసరి చేస్తే, వైరస్ వ్యాప్తి అవకాశాలు కుంగిపోతాయి. సబ్బుతో చేతులు శుభ్రపరచుకోవడం, విందులు వేడుకల్ని వాయిదావేసి జనం గుమిగూడకుండా ఉండటం తదితర జాగ్రత్తలు పాటిస్తే- గ్రామాలు తమను తామే సంరక్షించుకోగలుగుతాయి. ఇది గ్రామీణులు, స్థానిక పెద్దలు ఉమ్మడిగా సృష్టించాల్సిన కొత్త చరిత్ర!
కేరళలో అలా...
దేశంలో తొలి మూడు కరోనా కేసులూ నమోదైన రాష్ట్రం కేరళ. మొదట్లో అక్కడ పరిస్థితి పూర్తిగా చేజారిపోకుండా సత్ఫలితాన్నిచ్చింది- మూడంచెల కార్యాచరణ. అనుమానితుల్ని గుర్తించగానే ప్రత్యేక గదులకు పరిమితం చేయడం, వారితో సన్నిహితంగా మెలిగినవారిని, వాళ్లతోనూ అనుబంధంగా మసలినవారిని విడిగా ఉంచి రెండు దఫాల పరీక్షల్లో ‘నెగెటివ్’గా తేలాకనే విడిచిపెట్టే వ్యూహాన్ని కేరళ నిష్ఠగా అమలు జరిపింది. అక్కడితో పోలిస్తే పలు రాష్ట్రాల్లో ప్రజారోగ్య వ్యవస్థ ఆందోళనకరంగా ఉన్న దృష్ట్యా, మరిన్ని జాగ్రత్తలు అత్యవసరం. సకాలంలో సరైన వైద్య సేవలందక దేశంలో ఏటా 24 లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. విష జ్వరాలు, సాంక్రామిక వ్యాధులు సైతం జనాన్ని ఆనవాయితీగా హడలెత్తిస్తున్నాయి. అటువంటి చోట సరైన చికిత్స అందుబాటులో లేని కరోనా వైరస్ కోరచాస్తే ఉన్న అరకొర వసతుల ఆస్పత్రులు ఏ మూలకు?
సమష్టి ముందడుగుతో..
అధికారిక గణాంకాల ప్రకారం, దేశంలోని మొత్తం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడు లక్షల 10వేల వరకు పడకలున్నాయి. అందులో నాలుగున్నర లక్షల దాకా వాటా పట్టణ ప్రాంతాలదే. అంటే, దేశ జనాభాలో మూడింట రెండొంతుల మంది నివసించే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల పడకలు 36 శాతమే. ‘శతాబ్దపు ఉత్పాతం’గా బిల్ గేట్స్ అభివర్ణించిన కరోనా విజృంభణను ఎదుర్కొనే క్రమంలో- ఇప్పటికిప్పుడు కొత్త ఆస్పత్రులు, అదనపు పడకలు, తగినంత మంది వైద్య సిబ్బంది, ఇతరత్రా మౌలిక సదుపాయాలు సాకారమయ్యే అవకాశం ఎక్కడుంది? ఇటువంటప్పుడు, మారణకాండ సృష్టిస్తున్న కరోనా వైరస్ కట్టుతప్పకుండా ఏ గ్రామానికా గ్రామం సమష్టిగా ముందడుగేయాలి. నివారణలోనే గరిష్ఠ శక్తి సామర్థ్యాలు వినియోగిస్తే, ఊళ్లు తెరిపిన పడతాయి!
ఇదీ చదవండి: ప్రధాని మోదీ 'జనతా కర్ఫ్యూ'నకు మిశ్రమ స్పందన