తమిళ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చగల సత్తా ఉన్న ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆ రాష్ట్రంలోని 38 లోక్‌సభ స్థానాలతో పాటు.. 18 అసెంబ్లీ స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది.
ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
త్రిముఖ పోరు...
టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు సహా మరికొన్ని కారణాలతో ఖాళీ ఏర్పడిన 22 స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 18 నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్. మిగతా 4 స్థానాలకు పోలింగ్ మే 19న ఓటింగ్.
తమిళనాడులోని మొత్తం అసెంబ్లీ స్థానాలు 234. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థానాలు 117. ప్రస్తుతం అధికార అన్నాడీఎంకే బలం 114. మిత్రపక్షం కాంగ్రెస్‌తో కలిపి డీఎంకే బలం 97. ఇప్పుడు ఉపఎన్నికల్లో సాధ్యమైనన్ని సీట్లు సాధించి, చక్రం తిప్పాలని భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు.
- మెజారిటీ స్థానాలు గెలిచి.. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తోంది స్టాలిన్ నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే).
- టీటీవీ దినకరన్ కూడా తన ప్రభావాన్ని చూపే పనిలో ఉన్నారు. దివంగత జయలలిత అసలైన వారసుడ్ని తానేనంటూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు దినకరన్. తమిళనాడు రాజకీయాల్లో కింగ్‌మేకర్ కాగలనని ఆయన ధీమా.
- ప్రస్తుత పరిస్థితుల్లో మెజారిటీకి అవసరమైన 3 స్థానాలూ దక్కించుకోవడం పళనిస్వామి- పన్నీర్ వర్గం ముందున్న ప్రధాన సవాలు.
ఐటీ, ఈసీ దాడుల నేపథ్యంలో...
ఇటీవలి కాలంలో ద్రవిడ రాష్ట్రంలో వరుస ఐటీ దాడులకు తోడు ఎన్నికల సంఘం సోదాలు నిర్వహిస్తోంది. డీఎంకే నేత ఇంట్లో భారీగా నగదు పట్టుబడగా.. వెల్లూరు లోక్‌సభ స్థానానికి ఎన్నిక రద్దు చేశారు. డీఎంకే, ఏఎంఎంకే అభ్యర్థులు, మద్దతుదారుల ఇళ్లల్లో తనిఖీలు చేస్తున్నారు.
తూత్తుకుడి డీఎంకే అభ్యర్థి, దివంగత కరుణానిధి కుమార్తె కనిమొళి నివాసంలోనూ ఐటీ అధికారులు, ఈసీ బృందం వేర్వేరుగా సోదాలు చేసింది.
ఎన్నికల వేళ పొత్తులు...
పీఎంకే, డీఎండీకే, భాజపా.. అన్నాడీఎంకే మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఎండీఎంకే, వీసీకే, కాంగ్రెస్‌లు డీఎంకే కూటమిలో ఉన్నాయి. కమల్‌హాసన్ ఎంఎన్ఎం ఎవరితో పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగుతుంది.
తమిళనాడులో రేపటి ఎన్నికల కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం.
తమిళనాడు ఓటర్లు ..... 5.91 కోట్లు
పోలింగ్ స్టేషన్లు ..... 67, 720
ఇదీ చూడండి: భారత్ భేరి: డబుల్ ధమాకాపై డీఎంకే గురి