"ప్రజాప్రతినిధులు ఓటర్ల విశ్వాసానికి, ధర్మనిష్ఠకు భాండాగారం లాంటివారు. అందువల్ల వారి గుణగణాల గురించి ఎన్నుకున్న ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలను ప్రక్షాళించడమే ప్రస్తుత విచారణ ముఖ్య లక్ష్యం" అని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని తాజా, మాజీ ప్రజాప్రతినిధులపై వివిధ న్యాయస్థానాల్లో కొనసాగుతున్న కేసుల విచారణలో పురోగతి కనిపించకపోవటంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పెండింగ్‌లో ఉండిపోతున్న క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయడానికి వారం రోజుల్లో కార్యాచరణ రూపొందించి పంపాలని రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను ఆదేశించింది. రాజకీయాల్లో నేరారోపణలున్న వారి సంఖ్య పెరిగిపోవటం, ఇప్పటికే విచారణ జరుగుతున్న కేసులను బలవంతులైన ప్రజాప్రతినిధులు ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో వాటికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందని ధర్మాసనం అభిప్రాయపడింది.
పెండింగ్ కేసులు లిస్ట్ అయిన వెంటనే వాటిల్లో స్టే ఉన్నవి ఉంటే నిలుపుదల ఉత్తర్వులు కొనసాగించాలో వద్దో తక్షణం నిర్ణయం తీసుకోవాలి. స్టే అవసరం అనుకుంటే న్యాయస్థానం ఆ కేసుపై రోజు వారీ విచారణ జరిపి రెండు నెలల్లో ముగించాలి
-సుప్రీం కోర్టు ధర్మాసనం
హైకోర్టుకు ఆదేశాలు..
నేతలపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణ ఏడాదిలోగా పూర్తిచేయాలన్న 2015 నాటి సుప్రీంకోర్టు తీర్పు అమలుకాకపోవడాన్ని సవాల్‌చేస్తూ భాజపా నేత, న్యాయవాది అశ్వనీకుమార్ ఉపాధ్యాయ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
దీనిపై బుధవారం విచారణ జరిపిన సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హృషికేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాజ్యంలో చేపట్టాల్సిన తదుపరి చర్యల కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నుంచి కార్యాచరణ కోరుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ ప్రాసిక్యూషన్స్‌ను వేగవంతంగా పూర్తిచేయాలని ఇదివరకే సుప్రీంకోర్టు పలు ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత రిట్ పిటిషన్‌లో నోటీసుల జారీ వెనుక ప్రధాన ఉద్దేశం కూడా అదే. తాజా, మాజీ ప్రజాప్రతినిధులు తమ పలుకుబడితో విచారణను దెబ్బతీయడం, ప్రభావితం చేయబోవడం వంటి ప్రయత్నాలను దృష్టిలో ఉంచుకొనే ఈ అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలన్న అభిప్రాయానికి న్యాయస్థానం వచ్చింది.
-జస్టిస్ ఎన్.వి. రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం
క్షేత్రస్థాయిలో మార్పేది?
ప్రస్తుత కేసులో న్యాయస్థానం అన్నిరకాల చర్యలు తీసుకున్నప్పటికీ, చట్టసభల సభ్యుల (ఎంపీ, ఎమ్మెల్యేలు)పై పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల విచారణకు సంబంధించిన పరిస్థితుల్లో క్షేత్ర స్థాయిలో గణనీయమైన మెరుగుదల ఏమీ కనిపించటంలేదని ధర్మాసనం తెలిపింది.
"ఇప్పుడు హైకోర్టుల నుంచి వచ్చిన సమాచారం, అమికస్ క్యూరీ(కోర్టు సహాయకుడు), సొలిసిటర్ జనరల్, ఇతర న్యాయవాదులు అందించిన సమాచారంతో మనకు పూర్తి అవగాహన వచ్చింది. తాజా పరిస్థితులను మరింత మెరుగ్గా అంచనావేసే స్థితిలో ఉన్నాం. అందుకే ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుల హేతుబద్ధీకరణ సహేతుకమనిపిస్తోంది. ఈ విషయంలో ప్రత్యేకమైన ఆదేశాలు జారీచేసే ముందు హేతుబద్ధంగా ఎన్ని ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలన్న విషయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నుంచి కార్యాచరణ కోరడం సముచితం" అని భావిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది.
స్టే కొనసాగించే కేసుల్లో తక్షణ విచారణ
తాజా, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలపై పెండింగ్‌లో ఉన్న కేసులు, మరీ ముఖ్యంగా స్టే ఉన్న కేసులను హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, లేదంటే వారు ప్రతిపాదించిన ఇతర న్యాయమూర్తుల నేతృత్వంలోని ధర్మాసనాల ముందుంచాలని సుప్రీంకోర్టు తెలిపింది.
"పెండింగ్ కేసులు లిస్ట్ అయిన వెంటనే వాటిల్లో దేనికైనా స్టే ఉంటే దాన్ని కొనసాగించాలా? లేదా? అని ఏసియన్ రీసర్ఫేసింగ్ ఆఫ్ రోడ్ ఏజెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ సీబీఐ (2018)కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని సూత్రాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ స్టే అవసరం అనుకుంటే, కోర్టు ఆ కేసును రోజు వారీగా విచారించి అనవసరమైన వాయిదాలు వేయకుండా వీలైనంత మేరకు రెండు నెలల్లో విచారణ ముగించాలి.
ఈ ఆదేశాల పాలనకు కొవిడ్-19 అడ్డంకిగా ఉందని చెప్పకుండా, ఈ కేసులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలి. ఈ ఆదేశాలతో పాటు, ఈనెల 10న జారీచేసిన ఆదేశాలను కూడా హైకోర్టు రిజిస్ట్రార్ జనరళ్లు సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ముందుంచాలి. అమికస్ క్యూరీ చేసిన ఇతర సూచనలపై మేం తగిన సమయంలో ఆదేశాలు జారీ చేస్తాం" అని సుప్రీంకోర్టు ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. కేసు తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
కార్యాచరణ తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు
- రాష్ట్రంలోని జిల్లాల వారీగా ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి?
- వాటి విచారణకు ఎన్ని ప్రత్యేక కోర్టులు అవసరం అవుతాయి?
- ప్రస్తుతం ఎన్ని కోర్టులు అందుబాటులో ఉన్నాయి?
- ఎంతమంది న్యాయమూర్తులున్నారు? కేసుల్లో ఎన్ని రకాలు (సబ్జెక్ట్ కేటగిరీస్) ఉన్నాయి?
- ఎంత కాల పరిమితితో న్యాయమూర్తులను నియమించాలి?
- ఒక్కో న్యాయమూర్తికి ఎన్ని కేసుల విచారణ బాధ్యత అప్పగించాలి?
- కేసుల పరిష్కారానికి ఎంత సమయం పడుతుంది?
- ఎంత దూరానికి ఒక్కో కోర్టు ఏర్పాటు చేయాలి?
- మౌలిక వసతులు ఏం కావాలి?
ఒకవేళ ఏదైనా కేసులో విచారణ వేగవంతంగా సాగుతుంటే ఆ కేసును మళ్లీ వేరే కోర్టుకు బదిలీచేయడం అవసరమా? అలా చేయడం సహేతుకమేనా? అన్నది కూడా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే వివిధ కోర్టుల్లో జరుగుతున్న ఇలాంటి కేసుల విచారణ పురోగతిని పర్యవేక్షించడానికి అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు తమ ఆధ్వర్యంలో లేదా తాము ప్రతిపాదించిన జడ్జీల నేతృత్వంలో ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తెలిపింది.
ఈనెల 10వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల్లో అమికస్ క్యూరీ చేసిన సిఫార్సులపై అభిప్రాయాలు చెప్పడంతో పాటు, చట్టసభల సభ్యులపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణను వేగవంతంగా పూర్తిచేయడానికి ఇంకా ఏవైనా ఇతర సలహాలుంటే వారం రోజుల్లోపు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు పంపాలి. దీనికి సంబంధించిన ఒక ప్రతిని అమికస్ క్యూరీకీ ఈమెయిల్ ద్వారా అందించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: రాజకీయం.. నేరమయం- సుప్రీం తీర్పు ఆశాకిరణం