కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం విధించిన 3 రోజుల లాక్డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. దుకాణాలు మూతపడ్డాయి. నగరాల్లో ప్రజల రాకపోకలను నియంత్రిస్తూ పోలీసులు భారీ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఎడారిలా..
జులై 10 రాత్రి 10 గంటలకు ప్రారంభమైన లాక్డౌన్ 50 గంటలకుపైగా కొనసాగి జులై 13 ఉదయం 5 గంటలకు ముగియనుంది. లాక్డౌన్ వల్ల జన సంచారం పూర్తిగా స్తంభించింది. దీనితో రాష్ట్రంలోని పలు నగరాలు ఎడారిని తలపిస్తున్నాయి.
నిత్యవసరాలు మాత్రమే
లాక్డౌన్ విధించినప్పటికీ.. నిత్యవసరాలైన పాలు, పండ్లు, కూరగాయలు సహా ఇతర కిరాణా వస్తువులు అమ్మే షాపులకు మాత్రం అనుమతి ఇచ్చారు. మిగతా దుకాణాలు మూతపడ్డాయి. జనం కూడా ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరమైతే తప్ప గడపదాటి బయటకు రావడంలేదు.
రోడ్లపైకి వస్తున్న వారి గుర్తింపు కార్డులను పోలీసులు తనిఖీ చేస్తున్నారు. బలాదూర్‌గా తిరుగుతున్న వారిని తిరిగి వెనక్కి పంపించేస్తున్నారు.
యోగి మంచి చేస్తున్నారు!!!
"యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిని నియంత్రించడానికి ఇది అత్యవసరం. ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజలు కూడా సహకరించాలి. నా తల్లికి మందులు కొనేందుకు నేను బయటకు వచ్చాను. లేదంటే కచ్చితంగా ఇంట్లోనే ఉండేవాడిని."
- స్థానికుడు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకారం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 33,700 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో ఇప్పటి వరకు 889 మంది ప్రాణాలు కోల్పోగా.. 21,787 మంది కోలుకున్నారు.
ఇదీ చూడండి: భారత 'పులుల గణన'కు గిన్నిస్ రికార్డ్‌లో చోటు